పీసీసీ చీఫ్ పదవికి రాజీనామా చేసిన నవజ్యోత్ సింగ్ సిద్దూపై ఢిల్లీ పర్యటనలో ఉన్న మాజీ సీఎం అమరీందర్ సింగ్ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. సిద్దూ ఎప్పుడు మధ్యలో వదిలేసే రకమే… గతంలో టీంఇండియాను ఇంగ్లాండ్ లో వదిలేసినట్లుగా అంటూ మండిపడ్డారు. సిద్దూ తనకు చిన్నప్పటి నుండి తెలుసని, అతను ఒంటరి వ్యక్తే కానీ జట్టుగా ఉండలేరన్నారు.
పంజాబ్ అనేది సున్నితమైన రాష్ట్రం. పాక్ తో 600కి.మీ మేర పాక్ తో సరిహద్దు పంచుకుంటున్న రాష్ట్రం. ఇలాంటి రాష్ట్రాన్ని పాక్ ప్రధాని ఇమ్రాన్, పాక్ ఆర్మీ చీఫ్ ఒమర్ జావెద్ తో సన్నిహిత సంబంధాలున్న వ్యక్తికి అప్పజెప్పటం సరైంది కాదన్నారు. తన కేబినెట్ లో మంత్రిగా ఉన్నప్పుడు కూడా న్యాయం చేయలేదని, ఇప్పుడు సీఎం చన్నీ కేబినెట్ లో కూడా జోక్యం చేసుకుంటున్నారన్నారు. కేబినెట్ లో ఏం జరగాలన్నది సీఎం ఇష్టమని కెప్టెన్ స్పష్టం చేశారు.
కాగా, పంజాబ్ వ్యవహరాలను చక్కబెట్టేందుకు చండీఘడ్ వెళ్లేందుకు సిద్దమయిన రాష్ట్ర వ్యవహరాల ఇంచార్జ్ హరీష్ రావత్ ను అధిష్టానం వద్దని చెప్పింది. పార్టీలో ఏర్పడ్డ సంక్షోభాన్ని సీఎం చన్నీకే వదిలేయాలని, ఆయనే అన్నీ చూసుకుంటారని స్పష్టం చేసింది. దీంతో సీఎం అత్యవసరంగా కేబినెట్ మీటింగ్ ఏర్పాటు చేశారు.