సీఎం జగన్ ను చూస్తే ఊసరవెల్లి కూడా సిగ్గుపడుతుందన్నారు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు. గురువారం మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రానికి రెండుకళ్లు లాంటి అమరావతి, పోలవరంను దెబ్బతీశారని మండిపడ్డారు. ”రాష్ట్ర రాజధానిపై బుధవారం కేంద్రం సుప్రీంకోర్టులో అఫిడవిట్ వేసింది. శివరామకృష్ణ కమిటీ నివేదికను కేంద్రం సుప్రీంకోర్టులో ప్రస్తావించింది. శివరామకృష్ణ కమిటీ నివేదికను రాష్ట్రానికి పంపామని, అప్పటి రాష్ట్ర ప్రభుత్వం అమరావతిని రాజధానిగా ఎంపిక చేసిందని కేంద్రం పేర్కొంది. ఆ నిర్ణయాన్ని తాము ఆమోదించామని కేంద్రం చెప్పింది. ఇప్పటి రాష్ట్ర ప్రభుత్వం తమను సంప్రదించకుండానే 3 రాజధానుల చట్టం తెచ్చిందని కేంద్రం అఫిడవిట్‌లో స్పష్టంగా తెలిపింది. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రశ్నకు సమాధానంగానే కేంద్రం ఈ విషయాలు చెప్పింది.
అధికారంలోకి రాకముందు తాడేపల్లిలో ఇల్లు కట్టుకుని జగన్ ఏం చెప్పారు. అమరావతే రాజధానిగా ఉంటుందన్నారు. అమరావతిని తెలుగుదేశం పార్టీ కంటే మిన్నగా అభివృద్ధి చేస్తామని చెప్పారా? లేదా? ప్రజా జీవితం అంటే మీ దృష్టిలో చులకనైపోయిందన్నారు. మీ తీరు చూస్తూ ఊసరవెల్లి కూడా సిగ్గుపడుతుందన్నారు. ఓట్ల కోసం ఎన్నో అబద్దాలు చెప్పారు. చట్టానికి ఎన్ని తూట్లు పెట్టాలో అన్ని పెట్టి మీ ఇష్ట ప్రకారం చేశారు. అధికారం లేదని తెలిసినా? రాజధానిపై చట్టం చేసే హక్కు శాసనసభకు లేదా? అని మాట్లాడారు.
రాజధానిపై చట్టం చేయడానికి వీల్లేదని హైకోర్టు కూడా స్పష్టం చేసింది. ఏపీ పునర్విభజన చట్టం పార్లమెంట్ చేసింది. అందులో రాజధాని ఏ విధంగా చేయాలో స్పష్టంగా పేర్కొన్నారు. దాని ప్రకారం అమరావతి రాజధాని వచ్చింది.. రాష్ట్ర ప్రభుత్వానికి రాజధాని చట్టం చేసే హక్కులేదని న్యాయస్థానం చెప్పింది. దాన్ని వక్రీకరించి.. శాసనసభకు చట్టాలు చేసే అధికారం లేదా? అని ఇష్టానుసారం మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. విభజన చట్టం సెక్షన్5లో రాజధానిపై స్పష్టంగా ఉన్నా 3 రాజధానులపై శాసనసభలో బిల్లు పాస్ చేశారు. కౌన్సిల్‌లో నానా దుర్భాషలాడారు. 3 రాజధానుల బిల్లును కౌన్సిల్ సెలెక్ట్ కమిటీకి పంపిస్తే.. కౌన్సిల్ రద్దుకు తీర్మానం చేశారన్నారు.
ఆ తర్వాత కొంతకాలానికి కౌన్సిల్ రద్దు తీర్మానాన్ని ఉపసంహరించుకున్నారు. రాజధాని కోసం 29 వేల మంది రైతులు 34 వేల ఎకరాల భూమి స్వచ్ఛందంగా ఇచ్చారు. అమరావతి రాజధానిపై రూ.11,395 కోట్లు ఖర్చు పెడితే.. జగన్ ప్రభుత్వం అమరావతిపై విషం చిమ్మింది. రాజధాని రైతులు న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకు పాదయాత్ర చేస్తే ఎన్ని ఇబ్బందులు పెట్టాలో అన్ని ఇబ్బందులు పెట్టారు. లేని అధికారం ఆపాదించుకుని జగన్ రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు” అని విమర్శించారు చంద్రబాబు.