వైకాపా నేతలు, మంత్రులు రోజుకో మాట మాట్లాడి ప్రజలను గందర గోళానికి గురిచేస్తున్నారన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. రాష్ట్ర భవిష్యత్తును అంధకారంలోకి అధికార ప్రభుత్వం నెట్టేస్తుందని ఆరోపించారు. ఆరోజు.. ఈరోజు ఎప్పుడైనా అమరావతే ప్రజారాజదానన్నారు. రాష్ట్ర ప్రభుత్వం 7 నెలలుగా రాజధానిపై మీన మేషాలు లెక్కించింది. 13 జిల్లాల అభివృద్ధికి కావాల్సిన వనరులు, ఆదాయం సమకూర్చే రాజధాని అమరావతి. రాజధాని నిర్మాణానికి రూ.లక్షా తొమ్మిదివేల కోట్లు అవసరమని చెబుతున్నారు.
ఇప్పటి వరకు గత ప్రభుత్వం రాజధాని నిర్మాణం కోసం రూ.5వేల కోట్లు మాత్రమే ఖర్చు చేసిందని చెబుతున్నారు. అమరావతి కోసం మా ప్రభుత్వం రూ.9,165 కోట్లు ఖర్చు చేసింది. సచివాలయం, హైకోర్టు, అసెంబ్లీ ఇప్పటికే అమరావతిలో ఉన్నాయన్నారు. ల్యాండ్ పూలింగ్ అనేది వినూత్నమైన ఆలోచన, అమరావతిలో భూములు ఇచ్చింది ఎక్కువగా సన్న, చిన్నకారు రైతులేనన్నారు. ఎకరం కంటే తక్కువ భూమి ఉన్న రైతులు 20,490 మంది ఉన్నారు. అమరావతిలో రాజధాని లేకుండా చేసేందుకు వైసీపీ ప్రభుత్వం ఎన్నో ప్రయత్నాలు చేస్తుందన్నారు చంద్రబాబు.