ఓ క్యాబ్ డ్రైవర్ చిత్తశుద్ధికి, నిజాయితీకి గూగుల్, ట్విట్టర్ మాజీ ఎండీ పర్మేందర్ సింగ్ ఫిదా అయిపోయారు. ఢిల్లీలో ఇటీవల తనకు కలిగిన ఓ అనుభవాన్ని ఆయన ట్విటర్ ద్వారా షేర్ చేశారు. ఎన్నారై కూడా అయిన ఈయన..ఓ క్యాబ్ లో ఢిల్లీ విమానాశ్రయానికి వచ్చానని, కానీ విమానం ఎక్కే హడావుడిలో ఆ డ్రైవర్ కి చార్జ్ చెల్లించడం మరిచిపోయానని తెలిపారు. తానూ, తన సహచరులు ఇక్కడివారం కామని ఆ డ్రైవర్ కి తెలుసునని, కానీ ఎంతో నిజాయితీగా, మృదువుగా మాట్లాడాడని అన్నారు.
విమానం ఎక్కేముందు. ఇతనికి ఛార్జ్ చెల్లించడం మరిచిపోయినట్టు తెలుసుకున్న తాను వెంటనే వచ్చి అతనికి డబ్బులు ఇవ్వబోయినా ..వద్దని తిరస్కరించాడని పర్మేందర్ సింగ్ పేర్కొన్నారు. ఈ సారి వచ్చినప్పుడు తీసుకుంటానని చెప్పాడని .. కానీ చివరకు తన బలవంతం మీద తీసుకున్నాడని వెల్లడించారు.
నిజానికి ఇలాంటి డ్రైవర్లు చాలా అరుదుగా ఉంటారని, అతని ప్రవర్తన డీసెంట్ గా ఉందని ఆయన ప్రశంసించారు. ప్రస్తుతం ఈయన మీడియా కార్పొరేషన్ చీఫ్ కమర్షియల్ ఆఫీసరుగా పని చేస్తున్నారు.
పర్మేందర్ సింగ్ చేసిన ట్వీట్ పై స్పందించిన చాలామంది నెటిజన్లు.. ఈ రోజుల్లో ఇంత మానవతావాదం ఉండడం అరుదని పేర్కొన్నారు. ముఖ్యంగా ఢిల్లీ వంటి నగరాల్లో ఇలాంటివి ఊహించలేమన్నారు. కొంతమంది తమకు కలిగిన చేదు అనుభవాలను, క్యాబ్ డ్రైవర్ల దురుసు ప్రవర్తనను గుర్తుకు తెచ్చుకున్నారు. మీకు ఇంతమంచి క్యాబ్ డ్రైవర్ దొరకడం మీ అదృష్టమని అంటే.. మరికొంతమంది మీకు కలిగిన ఈ అనుభవాన్ని షేర్ చేయడం సంతోషకరమన్నారు.