ఈఎస్‌ఐ స్కాంలో అరెస్టైన జ్యూడిషియల్ రిమాండ్ లో ఉన్న మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడుకు హైకోర్టులో ఊరట లభించింది. ఆయనకు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే కోర్టు అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లొద్దని ఆదేశించింది.
అనారోగ్య కారణాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయనకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. ఆయన పూర్తిగా కోలుకున్నాకే ఇంటికి వెళ్లనున్నారు.
ఏపీలో 2014-15, 2018-19మధ్య ఈఎస్‌ఐ మందుల కొనుగోళ్లలో స్కామ్ జరిగిందని ఏసీబీ దర్యాప్తు జరుపుతుంది. దర్యాప్తులో భాగంగా 988.77 కోట్లా విలువైన మందులు, వైద్య పరికరాల కొనుగోలులో 150 కోట్లపైన అవినీతి అక్రమాలు జరిగినట్టు ప్రాథమికంగా నిర్దారించారు. ఈ అక్రమాలలో ప్రభుత్వ అధికారులు ప్రైవేటు వ్యక్తులతో కుమ్మకై ప్రభుత్వానికి నష్టం కలిగించారని, ఇదే అంశంలో మంత్రి ప్రమేయం కూడా ఉన్నట్లు ఏసీబీ కేసు నమోదు చేసి అరెస్ట్ చేసింది.
కార్మికశాఖ మంత్రిగా ఉన్న అచ్చెన్నాయుడు ఆదేశాలతో M/s Tele Health Services Pvt., Ltd అనే సంస్థకు కాల్ సెంటర్, టోల్ ఫ్రీ మరియు ECG సంబంధించి కాంట్రాక్ట్ చేసుకున్నారు.. దీనిపై మంత్రి ఓ లేఖ కూడా రాశారని ఏసీబీ ఆరోపించింది. ఇదే కేసులో పలువురు అధికారుల పేర్లు బయటకు కూడా వచ్చాయి.