దేవినేని ఉమామహేశ్వరరావు, మాజీ మంత్రి
సొంత మీడియాలో ఏదో పొడిచేసినట్టు డబ్బాలు కొట్టుకోవడం కాదు. 28 నెలల్లో జగన్ హాయాంలో పోలవరం ప్రాజెక్ట్ లో ఏఏ కాంపోనెంట్లలో ఎంతెంత పనులు చేశారో శ్వేతపత్రం విడుదల చేయాలి. బుల్లెట్లు దింపే ఇరిగేషన్ మంత్రి మీడియా ముందుకొచ్చి, తమ ప్రభుత్వంలో ఇంతపని జరిగిందని చెప్పగలరా..? ఆల్మట్టి ప్రాజెక్ట్ ఎత్తు పెంచుతానని కర్నాటక ముఖ్యమంత్రి, కృష్ణా జలాల్లో తమకు 50శాతం వాటా ఉందని పొరుగు రాష్ట్రం ముఖ్యమంత్రి అంటుంటే ఎందుకు జగన్ నోరెత్తడం లేదు..?
పోలవరం ప్రాజెక్ట్ పనులు శరవేగంగా జరుగుతున్నాయని డబ్బాలు కొట్టుకుంటే సరిపోదు. బహుళార్థసాథక ప్రాజెక్ట్ ని రూ.913 కోట్లతో లిఫ్ట్ ఇరిగేషన్ స్కీంగా మార్చారు. అసలు.. రూ.913కోట్ల లిఫ్ట్ పనులకు సంబంధించిన టెండర్లను ఎవరికి కట్టబెట్టారో ముఖ్యమంత్రి చెప్పాలి. టీడీపీ హయాంలోనే పోలవరం పనులు 71 శాతం వరకు జరిగాయి. స్పిల్ ఛానల్, స్పిల్ వే, పైలట్ ఛానల్, అప్రోచ్ ఛానల్ పనులు 85.5శాతం వరకు టీడీపీ ప్రభుత్వంలోనే పూర్తయ్యాయి. ప్రతీ సోమవారం చంద్రబాబు ప్రాజెక్ట్ పనులను పరిశీలించడం, వీలైనప్పుడల్లా పరిశీలించడం చేశారు.
జగన్ ముఖ్యమంత్రి అయ్యాక 4సార్లు పోలవరం ప్రాజెక్ట్ ని పరిశీలించి ఏం చేశారని ప్రశ్నిస్తున్నా. పట్టిసీమ ప్రాజెక్ట్ పంపులు పీకుతామన్నారు.. అదే పట్టిసీమ ఇప్పుడు జగన్ ప్రభుత్వానికి దిక్కయ్యింది. 2021 జూన్ అన్నారు.. మళ్లీ డిసెంబర్ అంటున్నారు.. ఇంతవరకు ఎక్కడ ఎంత పని జరిగిందంటే సమాధానం లేదు. డయాఫ్రమ్ వాల్, జెట్ గ్రౌటింగ్ పనులు టీడీపీ ప్రభుత్వంలోనే వంద శాతం పూర్తయ్యాయి. ప్రాజెక్ట్ నిర్మాణంలో 48 రేడియల్ గేట్లలో ఎన్ని బిగించారంటే ప్రభుత్వం, ముఖ్యమంత్రి దగ్గర సమాధానం లేదు.
కేంద్ర బృందం ప్రాజెక్ట్ పనులను పరిశీలించి అసంతృప్తి వ్యక్తంచేసింది నిజమా..? కాదా..? పవర్ ప్రాజెక్ట్ కోసం కక్కుర్తిపడి, పోలవరాన్ని నీరుగార్చింది ముఖ్యమంత్రి కాదా..? హిమాచల్ ప్రదేశ్, సిక్కిం, కర్నాటకలో ఉన్న పవర్ ప్రాజెక్ట్ లు చాలక పోలవరం పవర్ ప్రాజెక్ట్ పై కన్నేసి, సిగ్గు లేకుండా 2022 నాటికి పనులు పూర్తిచేస్తామని చెప్పుకుంటున్నారు. టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు 7 గ్రామాల నిర్వాసితులను ఖాళీ చేయించి తరువాతే పనులు ప్రారంభించాం.
జగన్ పాదయాత్ర సమయంలో రూ.19 లక్షలిస్తానని, ఎన్నికల వేళ రూ.9లక్షలిస్తానని చెప్పి నిర్వాసితులను మోసగించారు. నేడు పోలీసుల లాఠీలతో వారిని తన్ని తరిమేస్తున్నారు. నిర్వాసితులు పరిస్థితి చూశాక నాకు, లోకేష్ కి కళ్లు చెమ్మగిల్లాయి. వారిచేతిలో కొవ్వొత్తి, రెండు బంగాళదుంపలు పెట్టేసి పోలీసుల సాయంతో బలవంతంగా ఖాళీ చేయిస్తున్నారు ముఖ్యమంత్రి. ఈ ప్రభుత్వం నిర్వాసితులకు న్యాయం చేయకుండా, ప్రాజెక్ట్ నిర్మాణాన్ని ఎప్పటికి పూర్తి చేస్తుందనే ప్రశ్నకు సమాధానమే లేదు.
టీడీపీ హాయాంలో రూ.59 వేల కోట్లతో 64 సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం ప్రారంభమైంది. వాటిలో 4 పూర్తయ్యాయి. జగన్ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలోని ఇరిగేషన్ ప్రాజెక్ట్ ల పనులు ఎక్కడైనా జరుగుతున్నాయా..? కాంట్రాక్టర్లు ఎక్కడైనా పనులు చేస్తున్నారా..? పూర్తి వివరాలతో ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయగలదా..? గోదావరి కృష్ణా నదులపై నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టుల పర్యవేక్షణను కేంద్రానికి అప్పగిస్తారా..? బెంగళూరులోని తన ప్యాలెస్ ను, ఆస్తులను కాపాడుకోవడానికి ఏపీ రైతులను కర్నాటకకు తాకట్టు పెడతారా..?