ఏపీ మంత్రి అమర్నాథ్ కి.. కాపు ఉద్యమనేత చేగొండి హరిరామజోగయ్య లేఖ రాశారు. ప్రస్తుతం ఈ లేఖ చర్చనీయాంశంగా మారింది. ఈ లేఖలో హరిరామ జోగయ్య.. ‘నువ్వు రాజకీయాల్లో బచ్చావి.. పైకి రావాల్సిన వాడివి. సాధారణ మంత్రి పదవికి అమ్ముడు పోయి కాపుల భవిష్యత్తు నాశనం చేయకు. అనవసరంగా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పై బురద చల్లే ప్రయత్నం చేయకు. నీ మంచి కోరి చెబుతున్నా’.. అంటూ లేఖలో పేర్కొన్నారు.
ప్రస్తుతం ఈ లేఖ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అటు జనసేన నేతలు కూడా మంత్రి అమర్నాథ్ పై తీవ్రంగా విరుచుకు పడుతున్నారు. అమర్నాథ్.. జగన్మోహన్ రెడ్డికి బానిసగా మారాడన్నారు.
విచక్షణ, పద్దతి, ప్రొటోకాల్ అంటే తెలియని వాడు మంత్రి అవ్వడం ఆంధ్ర ప్రదేశ్ ప్రజల దురదృష్టమన్నారు. అనుచిత వ్యాఖ్యలు మానుకోకపోతే.. ఇంతకంటే తీవ్రంగా స్పందిస్తామన్నారు.
కాగా శనివారం పవన్ కళ్యాణ్ పై మంత్రి అమర్నాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. టీడీపీలో పవన్ ఓ సీనియర్ కార్యకర్త మాత్రమేనని వ్యాఖ్యానించారు. కాపులను తాకట్టు పెట్టేందుకు సిద్ధమయ్యారు. పవన్, చంద్రబాబులను లోకేష్ చెరో భుజంపై మోయడానికి సిద్ధమయ్యారని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో జనసేనకు వచ్చిన ఓట్ల కంటే నోటాకు వచ్చే ఓట్లు ఎక్కువగా ఉండటం ఖాయమని సెటైర్లు వేశారు.