సురభి వంశస్థులతో జూపల్లి బస్తీమే సవాల్
మాజీ మంత్రి జూపల్లి కన్ను సురభీ కోట భూములపై పడిందా…? సురభి వంశస్థుల స్థల వివాదంలో ఆనాటి మంత్రికేం సంబంధం…? గ్రామపంచాయితీ పేరుతో మంత్రి బెదిరింపులకు దిగారా…? మంత్రి పదవి పోయినా జూపల్లి పట్టువీడటం లేదా…? సురభి కోట భూములపై తొలివెలుగు అందిస్తోన్న ప్రత్యేక కథనం.
కొల్లాపూర్ నియోజకవర్గంలో… చారిత్రక సంపదగా ఉన్న సురభీవంశస్థుల కోట, చుట్టూ ఉన్న భూమిపై మాజీ మంత్రి జూపల్లి కన్ను పడిందని తెలుస్తోంది. గత ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న జూపల్లి ఆనాడే సురభీ కోట చుట్టూ ఉన్న భూమిని తన వశం చేసుకోవాలని చూశారని…తాను ఇస్తానన్న రెండు కోట్లకు విక్రయించకపోవటంతో వివాదం సృష్టిస్తున్నారని సురభి వంశస్థులు ఫైర్ అవుతున్నారు.
సురభి భూములపై సురభీ వంశస్థులకు మాజీమంత్రి జూపల్లి మధ్య కోల్డ్‌వార్ నడుస్తోంది. జూపల్లి కక్షసాధింపు చర్యలకు పాల్పడుతూ తమను ఇబ్బందిపెడుతున్నారని సురభి సంస్థానాధీశులు రాజా ఎస్వీకేకేబి ఆదిత్య లక్ష్మారావు ఆరోపిస్తున్నారు.
నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ రాజా వారి కోట చుట్టూ ఉన్న భూమి ఇప్పుడు వివాదంలో కూరుకపోయింది. కోట చుట్టుపక్కల వున్న స్థలం విషయంలో మాజీ మంత్రి జూపల్లి, రాజా వారి మధ్య సవాళ్ల పర్వం నడుస్తోంది. గతంలో జూపల్లి మంత్రిగా వున్నప్పుడు తన ఇద్దరు కుమారులతో కలిసి అత్తాపూర్ లోని తన నివాసంలో కలిశారని, ఆ సమయంలో కోట ముందున్న స్తలాని తనకు విక్రయించాలని కోరడం జరిగింది. దానికి నిరాకరించడంతో తన భూమిని అమ్ముకోనివ్వకుండ జూపల్లి అడ్డుపడుతున్నారని సురభి రాజు ఆరోపిస్తున్నారు. కోట ఉత్తరం వైపు, వెనుక పడమరలో వున్న భూమిని గతంలోనే విక్రయించడం జరిగిందని వారు స్పష్టం చేస్తున్నారు. దేశ ప్రజల కోసం సురభి వంశీయులు తమ పూర్వికులు ఎంతో చేశామని అన్నారు.
రాజా తరుపు న్యాయవాది కృష్ణప్రసాద్ మాట్లాడుతూ.. 1954, 56 సంవత్సరంలోనే జాగీర్ అడ్మినిస్ట్రేటివ్ కలెక్టర్ ఉత్తర్వుల ప్రకారం కోట వెనకల స్దలం కేటాయించారని.. ఆధారాలు లేకుండా సురభి వంశీయుల గౌరవానికి భంగం కల్గిస్తే పరువు నష్టం ధావా వేస్తామని హెచ్చరిస్తున్నారు.
మాజీ మంత్రి జూపల్లి మాత్రం ప్రభుత్వానికి కేటాయించిన భూమిని తన భూమిగా చెప్పుకుంటూ అక్రమ నిర్మాణలకు గ్రామపంచాయితీ నుంచి అనుమతులు తీసుకోవడం జరిగిందని, ఆ అనుమతులు రద్దు చేయించడం జరిగిందని అంటున్నారు. కోర్టులో కేసు కొనసాగుతున్న సమయంలో ఇతరులకు ఎలా విక్రయిస్తారని, కోటకు ఇరువైపుల నిర్మాణలు కొనసాగుతుండటంతో కోటకు వున్న అందాలు పోతాయని.. భవిష్యత్ తరాలకు కొల్లాపూర్ సంస్థానం కనుమరుగు అయ్యే పరిస్తితి వుంటుందని జూపల్లి అన్నారు. రెండు కోట్లు అడిగిన్నట్లు నిరూపిస్తే దేనికైన సిద్ధమని, ఈ నెల 16, 17 వ తేదీలలో అందుబాటులో వుంటానని లేకపోతే ఎక్కడికి రమ్మంటారో చెప్పాలని సవాల్ విసురుతున్నారు. తప్పుడు ఆరోపణలతో సురభి సంస్థానంపై వున్న గౌరవం నేటితో పోయిందని అంటున్నారు.
ఓ మంత్రిగా ఉంటూ గ్రామపంచాయితీ అక్రమ అనుమతులున్నాయని రద్దు చేయటం వెనుక ఎదో మర్మం ఉంటుందన్న వాదనలు వినిపిస్తున్నాయి. చాలా అంశాల్లో జూపల్లిపై అనేక ఆరోపణలున్నట్లు స్థానికులు పేర్కొంటున్నారు.