ఏపీ మాజీ మంత్రి నారాయణను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ లోని కొండాపూర్ లో ఆయన్ను అరెస్ట్ చేశారు సీఐడీ పోలీసులు. టెన్త్ పేపర్ లీకేజీతో నారాయణ విద్యాసంస్థలకు సంబంధం ఉందన్న ఆరోపణలతో నారాయణను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఏపీలో కొద్దిరోజులుగా పదో తరగతి పరీక్షా పత్రాల లీకేజీల వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. ఈ ఇష్యూ పొలిటికల్ టర్న్ తీసుకుని మాటల యుద్ధం కూడా కొనసాగుతోంది. తొలి పరీక్షతో మొదలుపెట్టి వరుసగా పేపర్లు లీక్ అయ్యాయి. దీనికి సంబంధించి పలువుర్ని ఇప్పటికే అరెస్ట్ చేశారు.
ఒకానొక దశలో ప్రభుత్వం పెట్టిన పాస్ టార్గెట్లతోనే టీచర్లు అక్రమాలకు దిగారన్న వాదన కూడా వినిపించింది. అయితే.. అవన్నీ తప్పని విద్యామంత్రి బొత్స ప్రకటన కూడా చేశారు. మొన్నామధ్య తిరుపతి సభలో ఏపీ సీఎం జగన్ పేపర్ లీకుల వ్యవహారంపై సంచలన కామెంట్స్ చేశారు.
రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేసేందుకే పదో తరగతి పేపర్లు లీక్ చేస్తున్నారని ఆరోపించారు. నారాయణ, శ్రీ చైతన్య స్కూళ్ల నుంచే పేపర్లు లీక్ అవుతున్నాయని ఆరోపించారు. చంద్రబాబు హయాంలో మంత్రిగా పనిచేసిన నారాయణ స్కూళ్లతో పాటు మూడు శ్రీ చైతన్యస్కూళ్ల నుంచి పేపర్లు లీక్ అయ్యాయని అన్నారు. ఈ నేపథ్యంలోనే నారాయణను అరెస్ట్ చేసినట్లుగా సమాచారం.