టీఆర్ఎస్ మొదటి దఫా పాలనలో చక్రం తిప్పిన పట్నం సోదరులు అసంతృప్తిలో ఉన్నారా…? కేసీఆర్ మాట విన్నందుకే అసలుకే ఎసరు వచ్చిందన్న ఫీలింగ్ ఎక్కువవుతోందా…? కేసీఆర్ సూచనతో రేవంత్‌ను ఓడించిన ఓరిగిందేంటీ అని మదనపడుతున్నారా…?
మొదటిసారి టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక… రంగారెడ్డి జిల్లాలో పట్నం సోదరుల హవా మొదలైంది. సీఎం కేసీఆర్, కేటీఆర్‌లు కూడా పట్నం సోదరులకు వెన్నంటి ఉండటంతో జిల్లా మొత్తం వీరు ఎంత చెప్తే అంతా అన్నట్లు సాగింది. అందుకే సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు పట్నం మహేందర్ రెడ్డి తన సోదరుడిని కొడంగల్‌లో పోటీకి నిలబెట్టారు.
పట్నం మహేందర్ రెడ్డి మంత్రిగా ఉండి కూడా… తన తాండూరును వదిలి కొడంగల్‌పైనే ఎక్కువ ఫోకస్ చేశారు. రేవంత్‌ను ఓడించాలన్న అధిష్టానం ఆదేశంతో తన సోదరుడు పట్నం నరేందర్ రెడ్డి గెలుపు కోసమే పనిచేశారు. అనుకున్నట్లుగానే రేవంత్ రెడ్డిని ఓడించి, కేసీఆర్‌కు గిఫ్ట్ ఇచ్చారు కానీ ఫోకస్ అంతా కొడంగల్‌పైనే పెట్టడంతో మంత్రి పట్నం మహేందర్ రెడ్డి తాండూరులో ఓడిపోయారు. దాంతో కొడంగల్ గెలుపుతో టీఆర్ఎస్‌లో, ప్రభుత్వంలో మరింత హవా కొనసాగించాలనుకున్న వారి ఆశలకు గండిపడింది. సీఎం కేసీఆర్ కూడా తర్వాత ఎమ్మెల్సీ ఇచ్చినా… మంత్రిని మాత్రం చేయలేదు. పైగా తమకు శత్రుత్వం ఉన్న సబితా ఇంద్రారెడ్డిని కాంగ్రెస్ నుండి తెచ్చి మంత్రిని చేయటంతో పుండు మీద కారం చల్లినట్లయిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేశారు.
అయితే, ఓకే పార్టీలో ఉండటంతో సఖ్యత వస్తుందని అంతా ఊహించినా… ఆ గ్యాప్ అలాగే కొనసాగుతోంది. పైగా మంత్రి హోదాలో తాండూరు సహ తమకు పట్టున్న ప్రాంతాల్లో మంత్రి సబితా పర్యటనలు పట్నం సోదరుల అసంతృప్తిని మరింత పెంచుతున్నాయని అభిప్రాయం వ్యక్తమవుతోంది. రేవంత్‌రెడ్డిని ఓడిస్తే తమకు ఎదో మేలు జరుగుతుందని అనుకుంటే… మేలు సంగతి అటుంచి తమ పరిస్థితి పెనం మీద నుండి పొయ్యిలో పడ్డట్లు అయిందని పట్నం సోదరులు ఆవేదనతో ఉన్నారన్న ప్రచారం జిల్లాలో జోరుగా సాగుతోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ALSO READ:
మంత్రి సబిత వర్సెస్ మాజీ మంత్రి పట్నం బ్రదర్స్