మంత్రి మల్లారెడ్డికి, మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మధ్య మేడ్చల్ నియోజకవర్గంలో పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది అన్నది ఓపెన్ సీక్రెట్. మంత్రి మల్లారెడ్డి కోసం తనకు రెండోసారి టికెట్ ఇవ్వలేదని సుధీర్ రెడ్డి అసంతృప్తిగా ఉన్నారు. కానీ అధికార పార్టీ నుండి బయటకు వచ్చే సాహసం చేయలేకపోయారు.
కానీ టీఆర్ఎస్ కమిటీల ఏర్పాటు సమయంలో తమకు పూర్తిగా ప్రాధాన్యత ఇవ్వకపోవటంతో సుధీర్ రెడ్డి వర్గం గుర్రుగా ఉంది. తమను తమ ఇలాకాలో పట్టించుకోకపోవటం, తన వర్గాన్ని తొక్కేస్తుండటం, తాము నోరు తెరిచి అడిగినా తమ వారికి పదవులు ఇవ్వకపోవటంతో వారు పార్టీకి గుడ్ బై చెప్పే ఆలోచనకు వచ్చినట్లు తెలుస్తోంది.
మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి పార్టీకి రాజీనామా యోచనలో ఉండగా, ఆయన కొడుకు మేడ్చల్ జెడ్పీ చైర్మన్ శరత్ చంద్రారెడ్డి తన పదవికి, పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. కొంతకాలంగా రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ స్పీడు పెంచిన నేపథ్యంలో కాంగ్రెస్ గూటికి చేరబోతున్నట్లు తెలుస్తోంది. దీంతో సుధీర్ రెడ్డిని బుజ్జగించేందుకు హుటాహుటిన మంత్రి హరీష్ రావును రంగంలోకి దింపినట్లు తెలుస్తోంది. కానీ, గతంలో హరీష్ రావు చొరవతో మెత్తబడిన ఆయన ఈసారి మాత్రం ససేమిరా అన్నారని, దీంతో స్వయంగా కేటీఆర్ రంగంలోకి దిగి బుజ్జగిస్తున్నట్లు తెలుస్తోంది.
అయితే, సుధీర్ రెడ్డితో పాటు ఆయన వర్గం నేతలు ప్రత్యేకంగా మీటింగ్ ఏర్పాటు చేసుకొని భవిష్యత్ నిర్ణయం తీసుకోవాలన్న ఆలోచనకు వచ్చినట్లు తెలుస్తోంది. పార్టీ నిర్ణయాన్ని గౌరవించి మల్లారెడ్డి గెలుపుకు సహకరిస్తే… ఇప్పుడు తమకే అన్యాయం చేయటం దారుణమని, పార్టీ కూడా చూసిచూడనట్లు వ్యవహరిస్తుందని సుధీర్ రెడ్డి వర్గీయులు ఆరోపిస్తున్నారు.