ముందుగా ప్రకటించినట్టే బీజేపీ గూటికి చేరారు టీఆర్ఎస్ నేత భిక్షమయ్య. రాష్ట్ర ఇంఛార్జ్ తరుణ్ చుగ్, అధ్యక్షుడు బండి సంజయ్ ఆయనకు కండువా కప్పి స్వాగతం పలికారు.
గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్న భిక్షమయ్య.. 2018లో కేటీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ లో చేరారు. అప్పట్లో ఆలేరు నియోజకవర్గ అభివృద్ధి కోసమే జాయిన్ అయ్యానని చెప్పారు. అయితే.. ఇతర టీఆర్ఎస్ నేతలు తనను ప్రజల్లోకి వెళ్లకుండా చేశారని ఆయనలో అసంతృప్తి ఉంది. ఈ నేపథ్యంలోనే బీజేపీలో చేరుతున్నట్లు సోమవారం ప్రకటించారు. చెప్పినట్లుగా తాజాగా కాషాయ కండువా కప్పుకున్నారు.
నియోజకవర్గ అభివృద్ధి కోసమే బీజేపీలో చేరానని తెలిపారు భిక్షమయ్య. టీఆర్ఎస్ లో ఉన్నన్నాళ్లూ తనను అభివృద్ధిలో భాగస్వామిని చేస్తారని భావించానని.. కానీ.. కొందరు కుట్రలు పన్నారని ఆరోపించారు. మూడేళ్లుగా ఆలేరు ప్రజలకు దూరమయ్యానని వివరించారు.
ఇక భిక్షమయ్య రాకపై సంతోషం వ్యక్తం చేశారు తరుణ్ చుగ్, బండి సంజయ్. కేసీఆర్ ను గద్దె దించడమే లక్ష్యంగా బీజేపీ పని చేస్తుందని స్పష్టం చేశారు.