జూనియర్ ఎన్టీఆర్ ను వల్లభనేని వంశీ, కొడాలి నాని వాడుకున్నంత విధంగా ఎవరు వాడుకోలేదన్నారు టీడీపీ మాజీ ఎమ్మెల్యే బోండా ఉమా. ఈ ఇద్దరి వల్లే జూనియర్ ఎన్టీఆర్ పార్టీ కి దూరం అయ్యాడంటూ ఆరోపణలు చేశారు. ఇసుక కొరతతో ఆంధ్రప్రదేశ్ లో ప్రజలు ఇబ్బంది పడుతుంటే అవేవి పట్టించుకోకుండ వైసీపీ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. టీటీడీ విషయంలో కొడాలి నాని వ్యాఖ్యలు అభ్యంతరకరంగా ఉన్నాయన్నారు. గర్వం తలకెక్కి తిరుమల శ్రీవారిపై ఇష్టం వచ్చినట్లు కొడాలి నాని మాట్లడటం మంచిది కాదని హెచ్చరించారు. కొడాలి నాని చేత సీఎం జగన్ క్షమాపణ చెప్పించాలని ఉమా డిమాండ్ చేశారు. వంశీ తన రాజకీయ అవసరాల కోసం పార్టీకి రాజీనామా చేశారని వంశీకి చంద్రబాబు ఎంపీ టికెట్ ,రెండు సార్లు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారన్న విషయం మరవ కూడదన్నారు. వంశీ ,అవినాష్ అధికారం ఎటు ఉంటే అటువైపు వెళ్తారని, వీళ్ళని జగన్ కూడా నమ్మడని బోండా ఉమా తెలిపారు.