తెలంగాణలో బలపడేందుకు ఉన్న అన్ని అవకాశాలను వినియోగించుకుంటున్న బీజేపీలోకి వలసలు పెరుగుతున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్ కీలక నేత విజయశాంతి వెళ్తున్నారన్న ప్రచారం సాగుతుండగా, ఉద్యమ నేత స్వామిగౌడ్ కాషాయదళంలో చేరిపోయారు. తాజాగా కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే, నిర్మల్ నుండి గతంలో ప్రాతినిధ్యం వహించిన మహేశ్వర్ రెడ్డి పార్టీ మారబోతున్నారన్న ప్రచారం జరుగుతుంది.
ఊహాగానాలకు బలం చేకూర్చేవిధంగా ఆయన తన కార్యకర్తలు, సన్నిహిత నేతలతో భేటీ అయ్యారు. డీసీసీ ప్రెసిడెంట్ గా కూడా ఉన్న మహేశ్వర్ రెడ్డి పార్టీ మార్పు చర్చనీయాంశంగా మారగా… స్థానికంగా ఉండే పరిస్థితులు తనకు అనుకూలంగా మారుతాయని ఆయన భావిస్తున్నట్లు తెలుస్తోంది.
బీజేపీ కీలక నేత భూపేంద్రసింగ్ యాదవ్ సమక్షంలో ఆయన బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా బీజేపీ పావులు కదుపుతుంది.