– రాహుల్ టూర్ తో కొత్త ఉత్సాహం
– పని చేస్తున్న వరంగల్ డిక్లరేషన్
– హస్తం వైపు చూస్తున్న గులాబీలు!
– ప్రస్తుతం నల్లాల ఓదేలు.. నెక్ట్స్ ఎవరు?
రైతు సంఘర్షణ సభ తర్వాత కాంగ్రెస్ పార్టీలో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. పార్టీకి మునుపటి వైభవం వస్తుందని సర్వత్రా చర్చ నడుస్తోంది. ఈ క్రమంలో వలసలు కూడా జోరందుకున్నాయి. ముఖ్యంగా టీఆర్‌ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ గూటికి భారీగా చేరికలు ఉంటాయనే టాక్ గట్టిగానే వినిపిస్తోంది. తాజాగా చెన్నూరు మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదేలు ఢిల్లీకి వెళ్లారు. అక్కడ రేవంత్ సమక్షంలో ప్రియాంక చేతుల మీదుగా హస్తం కండువా కప్పుకున్నారు.
మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఒదేలుకు గత ఎన్నికల్లో ఎమ్మెల్యే టిక్కెట్ దక్కలేదు. ఎమ్మెల్సీ అయినా దక్కుతుందని ఆశపడగా.. ఆ విషయంలోనూ నిరాశే ఎదురైంది. చివరకు తన భార్య భాగ్యలక్ష్మిని జెడ్పీటీసీ ఎన్నికల్లో గెలిపించినా.. అధికారాలు దక్కకపోవడంతో అసంతృప్తితో రగిలిపోయారు.
చెన్నూరు నియోజకవర్గంలో బాల్క సుమన్ కు ఓదేలుకు మధ్య అధిపత్య పోరు నడుస్తోంది. ఈ క్రమంలోనే ఓదేలు పార్టీ మార్పు నిర్ణయం తీసుకున్నారు. చాలా రోజుల నుంచి అసంతృప్తిలో ఉన్న ఓదేలు.. పార్టీ కార్యక్రమాలకు దూరంగానే ఉంటూ వచ్చారు.
వర్గ పోరు, అధిపత్య పోరుతో టీఆర్‌ఎస్ లో చాలాచోట్ల అనేక గొడవలు జరుగుతున్నాయి. వచ్చిన ప్రతీ లీడర్ ను పార్టీలోకి చేర్చుకోవడంతో ఒక్కో నియోజకవర్గంలో ఇద్దరు ముగ్గురు నేతలు టికెట్లు ఆశిస్తున్న పరిస్థితి ఉంది. కొన్ని చోట్ల అయితే నలుగురు పోటీ పడుతున్నారు. ఈ క్రమంలో ఆధిపత్య పోరు కొనసాగుతోంది. అప్పుడప్పుడు పంచాయితీలు కేసీఆర్ దగ్గరకు చేరినా.. ఆయన ఎమ్మెల్యేలకే మద్దతుగా నిలుస్తున్నట్లు చెప్పుకుంటున్నారు. దీంతో మిగిలిన వారు అసంతృప్తితో రగిలిపోతున్నారు. కొందరు వెనక్కి తగ్గి సైలెంట్ గా ఉండిపోతుంటే.. మరికొందరు పార్టీ మార్పుపై దృష్టి సారిస్తున్నారు. రానున్న రోజుల్లో టీఆర్‌ఎస్ నుంచి ఇతర పార్టీలకు చేరికలు భారీగా ఉంటాయని అంచనా వేస్తున్నారు విశ్లేషకులు.