హైకోర్టు లాయర్ల హత్య కేసులో మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. తను ఎమ్మెల్యేగా ఓడిపోయేందుకు కారణమైన ముగ్గురు నేతలను టార్గెట్ చేస్తూ పుట్ట మధు కుంట శ్రీనివాస్ తో వ్యవహారం నడిపించారని… అయితే, వీరి ఎత్తులకు స్థానికుడైన హైకోర్టు లాయర్ వామనరావు కొరకరాని కొయ్యగా మారారని, అందుకే తనను అడ్డు తొలిగించుకునేందుకే హత్య జరిగిందన్న ప్రచారం స్థానికంగా జోరుగా సాగుతోంది.
తను ఓడి, శ్రీధర్ బాబు గెలిచేందుకు ముగ్గురు వ్యక్తులు కీలకం అయ్యారని మధు వర్గీయులు భావించినట్లుగా తెలుస్తోంది. కలప రవాణాతో పుట్ట మధుకు ఆత్మీయంగా ఉండి, ఎన్నికల సమయంలో దూరమైన ఎడ్ల శ్రీనివాస్ పై పీడీయాక్ట్ పెట్టించారు. దీన్ని లాయర్ వామనరావు సవాలు చేసి… కేవలం రెండు కేసులున్న వ్యక్తిపై పీడీయాక్ట్ ఎలా పెట్టిస్తారని ప్రశ్నించారు. ఉప్పుట్ల శ్రీనివాస్ ను ఎన్నికల తర్వాత తనవైపుకు తిప్పుకున్నాడు. ఇక గతంలో మంథని ఉప సర్పంచ్ గా చేసిన ఇనుముల సతీష్ హత్యకు పథకం వేశారు. బయట ప్రచారంలో ఉన్న 50లక్షల సుపారీ హత్య ఆడియో దీనికి సంబంధించినదేనని తెలుస్తోంది.
ఇక లాయర్ల హత్య జరిగిన ప్రాంతంలో సీన్ ఆఫ్ అఫెన్స్ ను పోలీసులు కాపాడలేకపోవటం కూడా పుట్ట మధుపై ఆరోపణలకు కారణం అవుతుంది. ఇక తన బంధువులను ప్రేమించినందుకు దళితుడు మధుకర్ హత్య కేసును కూడా వామన్ రావు వాదించారు. రేవళ్లెలలో రాజారావు అనే దళితున్ని టీఆర్ఎస్ సర్పంచ్ ముందే హత్య చేశారు. మహా ముత్తారంలో ఓ హత్య, గోపాలపురంలో టీఆర్ఎస్ నేత అక్రమ సంబంధం కేసును కూడా హైకోర్టులో కేసు వేశాడు. ఆమె ప్రెగ్నెంట్ అని తెలిసిన తర్వాత తనకు న్యాయ సహాయం అందిస్తుండగా… ఆమెకు అబార్షన్ అయ్యింది. ఆ తర్వాత కేసు కోల్డ్ స్టోరేజ్ లోకి వెళ్లిపోయింది. ఇలా పుట్ట మధు అక్రమాస్తులు, ఇసుకతో పాటు కలప అక్రమ రవాణా కేసులను, ఆయన అనుచరుల ఆగడాలను హైకోర్టులో వామనరావు సవాల్ చేస్తున్నారు. ఇక లాకప్ డెత్ అయిన శీలం రంగయ్య కేసు పోలీసుల మెడకు చుట్టుకుంటున్న తరుణంలో… తనను అడ్డుతొలిగించుకునేందుకే ఈ హత్య జరిగిందన్న ప్రచారం జరుగుతోంది.
లాయర్ వామనరావు హత్యను కేవలం ఓ గ్రామంలోని ఆలయ ఇష్యూకి కనెక్ట్ అయ్యేలా చేసి… హత్య చేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కానీ ఆరోజంతా పుట్ట మధుతో ఉన్న కుంట శ్రీను ఉన్న విషయాన్ని పోలీసులు కూడా విస్మరిస్తున్నారని హైకోర్టు లాయర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.