గ్రేటర్ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ లో రేగిన అసంతృప్తులు ఇప్పట్లో చల్లారేలా లేదు. ఇప్పటికే మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మేయర్ కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పగా… మాజీ ఎంపీ, గ్రేటర్ అధ్యక్షుడు అంజన్ కుమార్ యాదవ్ పీసీసీ పై ఫైర్ అయ్యారు. తనకు మాట మాత్రం కూడా చెప్పకుండా గ్రేటర్ ఎన్నికలకు కమిటీలు వేయటంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేస్తూ, గాంధీభవన్ కు దూరంగా ఉన్నారు. దీంతో అంజన్ కుమార్ యాదవ్ కూడా పార్టీ మారుతారన్న ఊహాగానాలు వినిపించాయి.
పార్టీ మార్పు, అసంతృప్తిపై మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ పెదవి విప్పారు. గాంధీభవన్ కు ఎంతో మంది పీసీసీలు వస్తుంటారు, పోతుంటారు కానీ తాను మాత్రం లోకల్ అని, సోనియాగాంధీ నాయకత్వాన్ని బలపరుస్తూ పార్టీ కోసం పనిచేస్తూనే ఉంటానని ఆయన కుండబద్ధలు కొట్టారు. కానీ ఈ ఎన్నికలకు పీసీసీ చీఫ్ తమను కనీసం పట్టించుకోకపోవటం, మాట కూడా చెప్పకుండా సొంత నిర్ణయాలు తీసుకోవటం సరైంది కాదని ఆయన స్పష్టం చేశారు.