పోరాటాల నేపథ్యం నుండి వచ్చి ఎమ్మెల్యేగా ఉన్న రామలింగారెడ్డి మరణంతో ఖాళీ అయిన దుబ్బాక స్థానంపై ఇప్పుడు అందరి ఫోకస్ పడింది. దుబ్బాక సీటును ఖాళీ అయిందిగా అసెంబ్లీ గెజిట్ కూడా విడుదల చేసింది. దీంతో 6 నెలల్లోపు ఆ స్థానంలో ఉప ఎన్నికల నిర్వహించాల్సి ఉంది.
రామలింగారెడ్డి కుటుంబంతో కేసీఆర్ కు మంచి సాన్నిహిత్యం ఉండటంతో రామలింగారెడ్డి కొడుకు సతీష్ రెడ్డికి అవకాశం ఉంటుందని స్థానికంగా చర్చ సాగుతుంది. సతీష్ గత పంచాయితీ ఎన్నికల్లో అంతా తానే అయి వ్యవహరించాడు. దీంతో దుబ్బాక సీటు ఆయనకేనని రామలింగారెడ్డి వర్గీయులు భావిస్తున్న తరుణంలో సోషల్ మీడియాలో కొత్త వాదన తెరపైకి వచ్చింది.
ఖాళీ అయిన దుబ్బాక స్థానం నుండి సీఎం కేసీఆర్ కూతురు, మాజీ ఎంపీ కవిత పోటీ చేయనున్నారన్నది ఆ ప్రచార సారాంశం. దుబ్బాకకు కవితక్క రాబోతుందని, కల్వకుంట్ల కుటాంబానికి రుణపడి ఉన్నప్రజలకు మరోసారి రుణం తీర్చుకునే అవకాశం అంటూ కామెంట్స్ చేస్తున్నారు. దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవుతోంది. ఇదేం దిక్కుమాలిన రాజకీయం అంటూ ఫైర్ అవుతున్నారు.
మరోవైపు టీఆర్ఎస్ అగ్రనాయకత్వం మాత్రం కవితను ఇప్పటికే నిజామాబాద్ స్థానిక సంస్థల అభ్యర్థిగా ప్రకటించినందున…. దుబ్బాకకు మార్చే ఉద్దేశం ఉండదని, అది కేవలం కొంతమంది క్యాడర్ తెలిసీ తెలియక చేస్తున్న ప్రచారమేనని స్పష్టం చేస్తున్నారు.