బ్రిటన్ మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను హత్య చేస్తానని రష్యా అధ్యక్షుడు పుతిన్ బెదిరించారని ఆయన ఆరోపణలు చేశారు. తనపై క్షిపణి దాడి చేస్తానంటూ పుతిన్ అన్నారని ఆయన పేర్కొన్నారు. ఉక్రెయిన్- రష్యా యుద్ధానికి ముందు పిబ్రవరి 24న ఘటన జరిగినట్టు చెప్పారు.
బీబీసీ డాక్యుమెంటరీలో దీనిపై ఆయన వివరించారు. ఫోన్ కాల్‌లో స్పష్టమైన ముప్పు కనిపించిందన్నారు. ఉక్రెయిన్ పైకి రష్యా దాడి చేసే ముందు పుతిన్ తనను క్షిపణి దాడి చేసి హత్య చేస్తానని బెదిరించారని జాన్సన్ చెప్పారు. ఉక్రెయిన్ పై రష్యా దాడిని ఆపేందుకు జాన్సన్ తో పాటు పలు దేశాల నాయకులు రాజధాని కీవ్ కు వెళ్లినప్పుడు ఈ ఘటన జరిగింది.
ఓ సమయంలో పుతిన్ తనని బెదిరించాడన్నారు. మిమ్మల్ని బాధపెట్టాలని అనుకోవడం లేదని అందుకే క్షిపణితో మిమ్మల్ని లేపేస్తానంటూ పుతిన్ అన్నారని జాన్సన్ వివరించారు. లేదంటే అలాంటిదే మరేదైనా ప్లాన్ చేస్తానని పుతిన్ తనను బెదిరించారని జాన్సన్ అన్నారు.
యుద్దం ప్రారంభం కాక ముందునుంచి జాన్సన్ ఉక్రెయిన్ కు సహాయం చేస్తున్నారు. ఉక్రెయిన్ నాటోలో సభ్యత్వం తీసుకునే అవకాశం తక్షణమే లేదని తాను పుతిన్ తో అన్నట్టు చెప్పారు. దాడి ఏదైనా రష్యా సరిహద్దుల్లో అధికంగా జరుగుతోందని, ఇది నాటో చర్యలకు దారి తీస్తుందని తాను పుతిన్ తో చెప్పానన్నారు. అయితే ఈ విషయం చెప్పేటప్పుడు తాను చాలా జాగ్రత్తలు తీసుకున్నానన్నారు.