తెలంగాణ జన సమితి ఆధ్వర్యంలో టీఎస్పీఎస్సీ ప్రశ్న పత్రాల లీకేజీ పై కోదండరాం మౌన దీక్ష చేపట్టారు. ఈ విషయం గురించి వెంటనే హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ చేపట్టాలని ఆయన కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ బోర్డును ప్రక్షాళన చేసి ఉద్యోగాల భర్తీ ప్రక్రియను పారదర్శకంగా చేయాలన్నారు.
ప్రశ్న పత్రం లీకేజీలో నిందితులను కఠినంగా శిక్షించాలని కోరారు. దీని వెనుక ప్రభుత్వ పెద్దల ప్రమేయం ఉందని ఆరోపించారు. కావున వెంటనే సీఎం కేసీఆర్ దీనికి బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా వెంటనే ప్రభుత్వం నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి చెల్లించాలని కోరారు.
నోటిఫికేషన్స్ రద్దు ద్వారా నష్టపోయిన ప్రతి నిరుద్యోగ అభ్యర్థికి లక్ష రూపాయలు ప్రభుత్వం ఇవ్వాలని కోరారు.
ప్రస్తుతం టీఎస్పీఎస్సీ బోర్డును ప్రక్షాళన చేసి పారదర్శకంగా ఉద్యోగాలను భర్తీ చేయాలని , నీళ్ల పేరుతో కాళేశ్వరంలో కమిషన్లు మింగిన కేసీఆర్ నియామకాల విషయంలో పైసాల కోసం పరీక్ష పేపర్ లు అమ్ముకుంటున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో ఉన్న అన్ని నిధులు కేవలం కేసీఆర్ కుటుంబానికి మాత్రమే పరిమితం అయ్యాయని అన్నారు.
దీని మీద సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకునే వరకు టీజేఎస్ అధ్వర్యంలో పోరాటం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో టీజేఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు పీఎల్ విశ్వేశ్వర రావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు కుoట్ల ధర్మార్జున్, బైరీ రమేష్, రాష్ట్ర నాయకులు రాజ మల్లయ్య, శ్రీధర్, టీజేఎస్ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షులు సర్దార్ వినోద్ కుమార్, టీజేఎస్ జిల్లా పార్టీ అధ్యక్షులు, తుల్జారెడ్డి, దేశపాక శ్రీనివాస్, శ్రీనివాస్ రెడ్డి, హైదరాబాద్ జిల్లా కార్యదర్శి రామ్ చందర్, మహిళా విభాగం అధ్యక్షురాలు ఆర్ లక్ష్మి, విద్యార్థి నాయకులు అరుణ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.