ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ నేతలే లక్ష్యంగా ఆబ్కారీ, ఐటీ, ఏసీబీ దాడులు కొనసాగాయి.నకిలీ మద్యం కేసులో నిందితుడైన తెలుగుదేశం పార్టీ నాయకుడు, కర్నూలులో కేఈ ప్రతాప్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కేఈ ప్రతాప్ పై డోన్ మద్యనిషేధ, అబ్కారీ పోలీస్ స్టేషన్‌లో గతంలో నకిలీ మద్యం కేసు నమోదైంది. ఇందులో కేఈ పత్రాప్‌ను 26 నిందితునిగా చేర్చారు. అప్పటి నుంచి పరారీలో ఉండడంతో డోన్ కోర్టు సర్చ్ వారెంటు జారీచేసింది. దీంతో సీసీఎస్ డీఎస్పీ వినోద్‌కుమార్, సీఐ ఎల్లంరాజు, కర్నూలు రెండో పట్టణ పోలీసు స్టేషన్ సీఐ మహేశ్వరరెడ్డి తన సిబ్బందితో కేఈ ప్రతాప్ ఇంటికి వెళ్లారు. అయన లేకపోవటంతో కోర్టు ఉత్తర్వును ఇంటి డోర్ కు అతికించి వెళ్లిపోయారు.
అటు డోన్‌లోను కేఈ స్వగృహంతోపాటు మద్యం కేసులో నిందితులుగా ఉన్న పలువురి ఇళ్లలో సోదాలు జరిగాయి. డీఎస్పీ నరసింహారెడ్డి ఆధ్వర్యంలో పలువురు పోలీసులు పాల్గొన్నారు. కేసులో రెండో నిందితుడు పుట్లూరు శీను, మరో నిందితుడు భాష్యం శ్రీనివాసుల ఇళ్లలో తనిఖీలు జరిగాయి. పుట్లూరు శీను నూతన గృహంతోపాటు పాత ఇంటిని శోధించారు. కేఈ స్వగృహంలో 26 ఖాళీ క్యాన్లు దొరికాయి. పోలీసులు, రెవెన్యూ, పురపాలక సిబ్బంది వాటికి పంచనామా నిర్వహించారు. కేఈ స్వగృహంలో పోలీసులు దాడులు చేశారన్న సమాచారం డోన్‌లో సంచలనం కలిగించింది. అన్ని సోదాలు పూర్తయ్యేవరకు పోలీసులు ఇంటిలోకి ఎవరినీ రానివ్వలేదు. కేఈ గృహంలో పనివారు తప్ప కుటుంబ సభ్యులు ఎవరూ లేరు. సీఐలు కంబగిరి రాముడు, సుధాకర్‌రెడ్డి, ఎస్‌ఐలు ఇతర సిబ్బంది ఈ దాడుల్లో పాల్గొన్నారు.
మరో వైపు టీడీపీ కడప జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులరెడ్డి ఇంటిపై ఐటీ అధికారులు దాడి చేసి సోదాలు నిర్వహించారు. అలాగే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు పీఏగా పనిచేసిన, ప్రస్తుతం జీఏడీలో ఉద్యోగం చేస్తోన్న శ్రీనివాసుల ఇంటిపై ఏసీబీ వారు దాడులు నిర్వహించారు.