తెలంగాణ ప్రభుత్వానికి,గవర్నర్ కు మధ్య వివాదం జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఫిబ్రవరి 3 నుంచి శాసనసభ బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. ఈ సారి ఎలా ఉంటుందో అని తెలంగాణ ప్రజానీకం మొత్తం ఉత్కంఠగా ఎదురు చూస్తోంది. బడ్జెట్ సమావేశాల తేదీలు ఖరారైన తరుణంలో ఇప్పుడు గవర్నర్ తమిళి సై ఏం చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది.
బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా తన ప్రసంగం లేకపోవడం పై గత ఏడాది తీవ్ర వ్యాఖ్యలు చేసిన తమిళి సై ఈసారి ఎలా స్పందిస్తారని ఉత్కంఠ రేపుతోంది. ఉభయ సభలు ఆమోదించిన బిల్లులపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకొని గవర్నర్.. బడ్జెట్ విషయంలో ఏం చేస్తారన్నది ఇప్పుడు చర్చనీయాంశమైంది. రాష్ట్రంలో గవర్నర్ కు ,రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య దూరం బాగా పెరిగింది. గత ఏడాది గతతంత్ర దినోత్సవం, బడ్జెట్ సమావేశాల సందర్భంగా విభేదాలు బహిరంగంగా వ్యక్తవమయ్యాయి. తాజాగా మళ్లీ ఈ ఏడాది గణతంత్ర దినోత్సవంతో పాటు బడ్జెట్ సమావేశాలు సమీపించాయి.
బడ్జెట్ సమావేశాల ముహూర్తాన్ని వచ్చే నెల మూడో తేదీగా రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేసింది. గత సమావేశాల కొనసాగింపుగానే ఉభయ సభలు ఈసారి కూడా సమావేశం అవుతున్నాయి. దీంతో గవర్నర్ తో సంబంధం లేకుండానే ప్రభుత్వ నిర్ణయం మేరకు శాసన సభ సచివాలయం సభ్యులకు సమాచారం పంపింది. ఉభయ సభలను ప్రోరోగ్ చేయకపోవడంతో కొత్త సమావేశాలు కాకుండా గత సమావేశాలు కొనసాగించారు. దీంతో ఈ సారి ఉభయ సభ్యులను ఉద్దేశించి గవర్నర్ ప్రసగించే అవకాశం లేదు. నిరుడు బడ్జెట్ సమావేశాల్లోనూ గవర్నర్ లేదు.
ఈ విషయంపై గవర్నర్ బహిరంగంగానే రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని తప్పుపట్టారు. కేవలం ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు అనుమతి ఇస్తున్నట్లు అప్పట్లో ఆమె ప్రకటన కూడా ఇచ్చారు. తాజా బడ్జెట్ సమావేశాల సందర్భంగా కూడా గవర్నర్ ప్రసంగానికి అవకాశం లేకుండా పోయింది. అయితే బడ్జెట్ ప్రవేశ పెట్టే ముందు రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్ అనుమతి తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుంది. దీంతో ఈ సారి తిమిళి సై ఎలా స్పందిస్తారన్నది ఆసక్తి రేపుతోంది.