సైబర్ నేరగాళ్ల మాయలు,మోసాలకు అడ్డుఅదుపు లేకుండా పోతుంది. మాయమాటలనే పెట్టుబడిగా పెట్టి సైబర్ చీటింగ్స్ కు పాల్పడుతున్నారు మోసగాళ్లు. ఎంత జాగ్రత్తగా ఉన్నామని అనుకున్నా.. వారి బుట్టలో పడకుండా జనం ఉండలేకపోతున్నారు.
ఒక్కో కేసును చూస్తే.. సైబర్ చీటర్స్ ఊసరవెల్లిలా ఎలా వేషాలు వేస్తున్నారని ఆశ్చర్య పోవడం తప్ప చేసేదేమీ లేకుండా పోతుంది. సైబర్ క్రైమ్ పోలీసులకు అనుక్షణం ఛాలెంజ్ విసురుతున్న కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు. తాజాగా ఆర్మీ అధికారుల పేరుతో 25 లక్షల మోసానికి తెర లేపారు మోసగాళ్లు.
స్కానింగ్ మెషీన్స్ కావాలంటూ ఫార్మా కంపెనీని ముంచారు. ఆర్మీ రూల్స్ ప్రకారం ముందుగా కొంత డబ్బు డిపాజిట్ చేయాలన్న కేటుగాళ్ళు.. ఆ కంపెనీ నుంచి విడతల వారిగా 25 లక్షలు కాజేశారు. ఆ డబ్బు తమకు రాలేదని.. మరింత డబ్బులు పంపాలని మోసగాళ్ళు ఒత్తిడి చేయడంతో..అనుమానం వచ్చిన ఫార్మా కంపెనీ యాజమాన్యం సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది.
ఇక ఇలా ఉంటే అందమైన అమ్మాయి న్యూడ్ వీడియో కాల్ చేసి ఓ ప్రభుత్వోద్యోగిని బ్లాక్ మెయిల్ చేసింది.. ఆ వీడియోను సోషల్ మీడియాలో పెడతానని.. బెదిరించి 5లక్షల రూపాయలు కాజేసింది. దీంతో ఆ ఉద్యోగి సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.