హత్యకు ముందు ఎమ్మార్వో గదిలో.... - Tolivelugu

హత్యకు ముందు ఎమ్మార్వో గదిలో….

హత్యకు ముందు ఎమ్మార్వో గదిలో ఏం జరిగింది…? పెట్రోల్‌ పోస్తున్న టైంలో గదిలో ఎంతమంది ఉన్నారు…? ఎమ్మార్వో అక్కడిక్కడే చనిపోయేంత వరకు ఎవరూ కాపాడే ప్రయత్నం చేయలేదా…? పెట్రోల్‌ సీసాతో లోపలికి వెళ్లిన సురేష్-మంటల్లో కాలిపోతూ బయటకు వచ్చిన ఎమ్మార్వో… ఈ గ్యాప్‌లో అసలేం జరిగింది…? తొలివెలుగు ఎక్స్‌క్లూజివ్ స్టోరీ.

ఏ భూమి కోసం సురేష్ ఇంత దారుణానికి తెగబడ్డాడు, ఓ ఎమ్మార్వోనే…అదీ పెట్రోల్‌ పోసి హత్య చేయాలనే ఆలోచన ఎలా వచ్చింది, హత్యలో ఇంకెవరి భాగస్వామ్యం ఉందన్న విషయాలను కొద్దిసేపు పక్కనపెడితే…

నిజానికి… దాడి జరిగిన సమయానికి హైకోర్టులో ఓ కేసుకు ఎమ్మార్వో విజయారెడ్డి వెళ్లాల్సి ఉంది, కానీ కోర్టు వద్ద లాయర్లు నిరసన ప్రదర్శన ఉండటంతో కేసు విచారణ వాయిదా పడుతుందని అబ్దుల్లాపూర్‌ మెట్‌ కార్యాలయంలోనే ఎమ్మార్వో ఉండిపోయారు. ఉదయం నుండి ఎమ్మార్వో గారు మధ్యాహ్నం తర్వాతే ఆఫీసుకు వస్తారని, కోర్టుకు వెళ్తున్నారని అక్కడి అధికారులు చెప్పటంతో… దాడి జరిగిన సమయానికి అక్కడ అధికారులు మినహా ఇతర ప్రజలు పెద్దగా లేరు.

తొలివెలుగు టీం ఆరా తీయగా తెలిసిన నిజాలేంటంటే… “నేను మేడంతో మాట్లాడాలి” అంటూ ఎమ్మార్వో గదిలోకి వెళ్లిన సురేష్… ఎమ్మార్వోతో కాస్సేపు వాగ్వాదానికి దిగినట్లు తెలుస్తోంది. ఆ సమయంలో ఎమ్మార్వో, సురేష్‌తో పాటు ఎమ్మార్వో డ్రైవర్‌ గుర్నాథం కూడా గదిలోనే ఉన్నారు. అప్పటికే తాగిన మైకంలో ఉన్న సురేష్‌… ఎమ్మార్వోపై అరుస్తూ… పెట్రోల్‌ను చల్లటంతో ఒక్కసారిగా అలర్టైన డ్రైవర్‌ గుర్నాథం… సురేష్‌ను అదుపు చేసే ప్రయత్నం చేశాడు. ఆ సమయంలో డ్రైవర్, ఎమ్మార్వో, సురేష్‌పై కూడా పెట్రోల్ పడింది. అయినా సురేష్‌ అగ్గిపెట్టేతో అంటించటంతో ముగ్గురికి మంటలు అంటుకున్నాయి. అంతలోనే తేరుకున్న సురేష్‌… తన చొక్కా విప్పుకొని ప్రాణాలతో బయటపడ్డాడు. డ్రైవర్‌ కూడా చొక్కా విప్పుకొని బయటపడే అవకాశం ఉన్నా… ఎమ్మార్వోను కాపాడే ప్రయత్నం చేయటంతో…ఎమ్మార్వో, డ్రైవర్ ఇద్దరూ తీవ్ర గాయాలపాలయ్యారు. ఎమ్మార్వో అక్కడికక్కడే మరణించగా, డ్రైవర్ చికిత్స పొందుతూ మరణించాడు.

అలా ఎమ్మార్వోను మృత్యువు వెంటాడగా, యజమానిని కాపాడే ప్రయత్నంలో డ్రైవర్‌ కూడా మృతి చెందినట్లు తెలుస్తోంది.

అయితే, సురేష్‌ ఎందుకు పెట్రోల్ పోసాడు, భూ తగాదాలే అసలు కారణమా…? ఇంకేదయినా ఉందా…అనే అంశాలపై తొలివెలుగు టీం పరిశోధన కొనసాగిస్తోంది. అతి త్వరలో పూర్తి వివరాలతో… మరో విశ్లేషణాత్మక కథనంతో తొలివెలుగు పూర్తి సమాచారాన్ని అందించే ప్రయత్నం చేస్తుంది.

Share on facebook
Share on twitter
Share on whatsapp