– మహారాష్ట్రలో తెలంగాణ ఫార్ములా!
– కో ఆర్డినేటర్లను ప్రకటించిన కేసీఆర్
– జెడ్పీ పంచాయతీ సమితి ఎన్నికలకు కసరత్తు
– తొలి బీఆర్ఎస్ సభకు వచ్చిన వారికే ఛాన్స్
– త్వరలోనే మరో మూడు భారీ బహిరంగ సభలు
– క్షేత్ర స్థాయిలో ప్రచారం చేపట్టనున్న జిల్లా ఇంఛార్జీలు
బీఆర్ఎస్ పార్టీ విస్తరణపై కేసీఆర్ ఫోకస్ పెట్టారు. ఈ నేపథ్యంలో తాజాగా కేసీఆర్ కో ఆర్డినేటర్లను ప్రకటించారు. ఉత్తర ప్రదేశ్ బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీగా హిమాన్షు తివారీని నియమించారు. మహారాష్ట్ర బీఆర్ఎస్ రీజినల్ కో ఆర్డినేటర్ లను నియమించారు.
నాసిక్ డివిజన్ కో ఆర్డినేటర్ గా దశరథ్ సావంత్, పుణె డివిజన్ కో ఆర్డి నేటర్ గా బాలా సాహెబ్ జైశ్రీరామ్ దేశ్ ముఖ్, ముంబై డివిజన్ కో ఆర్డినేటర్ గా విజయ్ టాంజై మెహితేలను నియమించారు. ఔరంగాబాద్ డివిజన్ ఆర్డినేటర్ గా సోమ్ నాథ్, నాగ్ పూర్ డివిజన్ కో ఆర్డినేటర్ గా ద్యానేష్ వకుద్కర్, అమరావతి డివిజన్ కో ఆర్డినేటర్ గా నిఖిల్ దేశ్ ముఖ్ లను కేసీఆర్ నియమించారు.
ఇక మహారాష్ట్రలోను తెలంగాణ ఫార్ములాను అమలు చేసే పనిలో పడ్డారు కేసీఆర్. ఇందులో భాగంగా మహారాష్ట్రలో స్థానిక సంస్థల ఎన్నికలకు ముందు ఆ రాష్ట్రంలో భారత్ రాష్ట్ర సమితి తొలి సమావేశాన్ని నిర్వహించినట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. తెలంగాణ తరహాలోనే జడ్పీ పంచాయతీ సమితి ఎన్నికలకు సమాయత్తం అవుతున్నారు.
ఇక బీఆర్ఎస్ ఏర్పాటు తర్వాత మహారాష్ట్ర తొలిసారిగా జరిగిన గత నెల 5 నాటి నాందేడ్ సభలో పెద్ద కేడర్ ఉన్న నేతలు ఎవరు ఎక్కువగా చేరలేదు. అయితే ఎవరైతే ఈ సభకు వచ్చారో వారికి జడ్పీ ఎన్నికల్లో సీట్ ఇవ్వాలని కేసీఆర్ భావిస్తున్నట్లు సమాచారం. కాబట్టి ఎన్నికలకు ముందు బహిరంగ సభలు పెడితే.. బాగుంటుందని వారు సూచించారట. దీంతో త్వరలోనే విదర్భ, ఉత్తర మహారాష్ట్ర, ముంబై లలో బహిరంగ సభల ఏర్పాటుకు కసరత్తు జరుగుతోంది.
మరో వైపు మహారాష్ట్రలో స్థానిక ఎన్నికలకు నగారా మోగుతున్న నేపథ్యంలో పార్టీని బలోపేతం చేసేందుకు కేసీఆర్ మహారాష్ట్రలోని ఆయా జిల్లాలకు ఇంఛార్జీలను నియమిస్తున్నారు. గత రెండు రోజుల క్రితం అంతర్గతంగా జరిగిన పార్టీ సమావేశంలో జిల్లాల ముఖ్య నేతలతో సమావేశం అయ్యారు. జిల్లా ఇంఛార్జీలు త్వరలోనే మహారాష్ట్ర వెళ్లి స్థానిక సంస్థల ఎన్నికల్లో క్షేత్ర స్థాయి ప్రచారం చేపట్టనున్నారు.