వలస పాలనకు వ్యతిరేకంగా భారతీయుల వాయిస్ వినిపించేందుకు గాను ‘నేషనల్ హెరాల్డ్’ పత్రికను 1938లో అప్పటి కాంగ్రెస్ అధ్యక్షుడు జవహర్‌లాల్ నెహ్రూ ప్రారంభించారు. దీని నిర్వహణ బాధ్యతలను అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్(ఏజేఎల్) సంస్థ చూసుకునేది.
ఈ పత్రికు ప్రధాన దాత నెహ్రూ కాగా సుమారు 5 వేల మంది స్వతంత్ర్య సమరయోధులు వాటాదారులుగా ఉండేవారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చాక కాంగ్రెస్ కు అధికార పత్రికగా నేషనల్ హెరాల్డ్ (ఆంగ్లం) ఉండేది. ఇది ఉర్దూలో ‘క్వామీ అవాజ్’గా , హిందీలో ‘నవజీవన్’గా వెలువడేది.
నేషనల్ హెరాల్డ్ పత్రిక 2008లో మూతపడింది. అప్పటకి ఆ పత్రిక కాంగ్రెస్ కు రూ.90.25 కోట్ల మేర బకాయిపడింది. దీనికి ఎలాంటి వడ్డీలు వసూలు చేయలేదు.
2009లో కాంగ్రెస్ నేతృత్వంలో యూపీఏ రెండో సారి అధికార పగ్గాలు చేపట్టింది. ఈ క్రమంలో 2010లో లాభాపేక్షలేని దాతృసంస్థగా యంగ్ ఇండియన్ లిమిటెడ్(వైఐఎల్) ప్రారంభమైంది. దీనికి డైరెక్టర్ గా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఉన్నారు. ఆయనతో పాటు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, కాంగ్రెస్ నేతలు ఆస్కార్ ఫెర్నాండెజ్, మోతీలాల్ వోరాలు ఆ సంస్థలో భాగస్వాములు. తర్వాత కాలంలో మోతీలాల్ వోరా, ఆస్కార్ ఫెర్నాండెజ్ మరణించారు.
తనకు బకాయిపడిన ఏజేఎల్ ను 2011లో యంగ్ ఇండియన్ లిమిటెడ్‌కు కాంగ్రెస్ అప్పగించింది. దీంతో ఒప్పందం ప్రకారం కాంగ్రెస్ కు వైఐఎల్ రూ.50 లక్షలను చెల్లించి నేషనల్ హెరాల్డ్ హక్కులను దక్కించుకుంది. దీంతో 2016లో ఏజేఎల్ తన పత్రికను మూడు భాషల్లో పునఃప్రారంభించింది.
ఈ క్రమంలో నేషనల్ హెరాల్డ్ వ్యవహారంలో భారీ కుంభకోణం జరిగిందని, అందులో సోనియా, రాహుల్ గాంధీల ప్రమేయం ఉందని ఆరోపిస్తూ బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి ఢిల్లీ కోర్టులో 2012లో పిటిషన్ వేశారు.
వైఐఎల్ సంస్థ మూలధన పెట్టుబడి రూ. 5 లక్షలు మాత్రమేనని సుబ్రహ్మణ స్వామి ఆరోపించారు. కోల్ కతాకు చెందిన డొటెక్స్ మర్చెండైజ్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి వైఐఎల్ సంస్థ రూ.కోటి రుణం తీసుకుందని, దానిలో నుంచి రూ. 50 లక్షలను కాంగ్రెస్ కు చెల్లించిందని ఆయన ఆరోపించారు.
మూతపడిన మీడియా సంస్థ ఐజేఎల్ కు చెందిన రూ. 2వేల కోట్లకు పైగా విలువగల భూములను వైఐఎల్ మోసపూరితంగా స్వాధీనం చేసుకున్నట్టు ఆయన పిటిషన్ లో పేర్కొన్నారు.
అయితే రూ.90.25 కోట్లను వడ్డీలేని రుణంగా ఏజేఎల్‌కు ఇచ్చామని, అందువల్ల ఇది సక్రమమేనని కాంగ్రెస్ వాదిస్తోంది. ఏజేఎల్ అనేది తమ అనుబంధ సంస్థేనని, మూతపడిన సంస్థను, దానికి చెందిన పత్రికలను పునరుద్ధరించడం తమ పార్టీ బాధ్యత అని పేర్కొంది. ఇందులో యంగ్ ఇండియన్ లిమిటెడ్ దాతృత్వ సంస్థ మాత్రమేనని దానికి ఎలాంటి లాభార్జనా ఉద్దేశం లేదని అంటోంది.