తెలంగాణ ఇంటర్ బోర్డు ఇంటర్ పరీక్షలకి సంబంధించి కీలక ప్రకటన చేసింది. ఇప్పటి వరకు ఫీజు చెల్లించని విద్యార్థులకి ఇంటర్ బోర్డు మరో అవకాశాన్ని కల్పించింది. రూ. 100 ఆలస్య రుసుముతో డిసెంబర్ 12 వరకు ఇంటర్ ఫీజు చెల్లించవచ్చని పేర్కొంది.
విద్యార్థులు వారి కాలేజీల్లో ఫీజులను చెల్లించాలని సూచించింది. డిసెంబర్ 13లోగా ఇంటర్ బోర్డుకు ఫీజుల మొత్తాన్ని బదిలి చేయాలని ఆదేశించింది. ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు నవంబర్ 14 నుంచి 30 లోపు ఫీజులు చెల్లించాలని గతంలో ఇంటర్ బోర్డు ఉత్తర్వులు జారీ చేసింది.
రూ.100 ఆలస్య రుసుముతో డిసెంబర్ 2 నుంచి 6 వరకు.. రూ.500 రుసుముతో 8 నుంచి 12 వరకు, వెయ్యి రుసుముతో 14 నుంచి 17 వరకు, రూ.2000 ఆలస్య రుసుముతో డిసెంబర్ 19 నుంచి 22 వరకు ఫీజు చెల్లించవచ్చని పేర్కొంది. అయితే విద్యార్థుల వినతి మేరకు తాజాగా కేవలం రూ. 100 ఆలస్య రుసుముతో డిసెంబర్ 12 వరకు ఫీజులు చెల్లించేందుకు ఇంటర్ బోర్డు అనుమతిచ్చింది.
ఫస్టియర్, సెకండియర్ జనరల్ కోర్సుల విద్యార్థులు రూ.500, సైన్స్, వొకేషనల్ విద్యార్థులు రూ.710 ఫీజుగా చెల్లించాలని అధికారులు సూచించారు. మరోవైపు ఇంటర్ పరీక్షల్లో ఈ ఏడాది 100 శాతం సిలబస్ అమలవుతుందని.. పాతపద్ధతిలోనే పరీక్షలను నిర్వహిస్తామని అధికారులు ఇప్పటికే వెల్లడించారు.