ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి కుమారుడు మాగుంట రాఘవరెడ్డి జ్యుడీషియల్ రిమాండ్ ను స్పెషల్ కోర్టు పొడిగించింది. మార్చి 28 వరకు జ్యుడీషియల్ రిమాండ్ పొడిగించింది. ఇక రాఘవ రెడ్డి జ్యుడీషియల్ కస్టడీ నేటితో ముగిసింది.
ప్రస్తుతం రాఘవరెడ్డి తీహార్ జైలులో ఉండటం గమనార్హం. అతనిని ఈరోజు సీబీఐ కోర్టులో ఈడీ అధికారులు హాజరుపరిచారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో విచారణ పురోగతిలో ఉందని.. కాబట్టి మాగుంట రాఘవ రెడ్డికి జ్యుడీషియల్ కస్టడీని పొడిగించాలని ఈడీ అధికారులు సీబీఐ కోర్టులో రిక్వెస్ట్ చేశారు.ఈడీ అభ్యర్థన మేరకు మార్చి 28 వరకు జ్యుడీషియల్ కస్టడీని పొడిగిస్తూ కాసేపటి క్రితమే సీబీఐ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.
సౌత్ గ్రూప్ లో రాఘవరెడ్డి కీలక పాత్ర పోషించినట్లు విచారణలో నిర్ధారించిన ఈడీ అధికారులు ఆపై అతనిని అదుపులోకి తీసుకున్నారు. పదిరోజుల పాటు ఈడీ కస్టడీలోకి తీసుకొని మాగుంటను విచారించింది. విచారణ అనంతరం జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. తాజాగా జ్యుడీషియల్ కస్టడీ ముగియడంతోనే మరో 11 రోజుల పాటు కస్టడీని పొడగిస్తూ సీబీఐ కోర్టు తీర్పునిచ్చింది.
మరో వైపు ఢిల్లీ లిక్కర్ కేసుకు సంబంధించి మాగుంట రాఘవరెడ్డి వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డికి ఈడీ నోటీసులు జారీ చేసింది. ఈ రోజు ఈడీ విచారణకు శ్రీనివాసులురెడ్డి హాజరుకావాల్సి ఉంది. అయితే ఇంత వరకు మాగుంట హాజరుపై ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. ఈ విషయంపై అటు ఈడీ అధికారులు నుంచి కూడా ఎలాంటి సమాచారం లేదు.