ఈమధ్య కాలంలో బాగా హిట్టయిన సినిమాలు ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్2. ఇప్పుడీ రెండు సినిమాలు ఒకేసారి ఓటీటీలోకి వస్తున్నాయి. దీంతో సహజంగానే నెటిజన్లు, ఓటీటీ వీక్షకులు పండగ చేసుకుంటున్నారు. ఈ వీకెండ్ ఈ రెండు సినిమాలు కవర్ చేయాలని ఎదురుచూస్తున్నారు. అయితే ఇలా ఆశపడేవాళ్లందరికీ ఓ బ్యాడ్ న్యూస్.
ఓటీటీలో కేజీఎఫ్2, ఆర్ఆర్ఆర్ సినిమాలు చూడాలనుకుంటే కేవలం ఆ ఓటీటీల్లో సబ్ స్క్రిప్షన్ ఉంటే సరిపోదు. ఈ సినిమాల కోసం అదనంగా కొంత మొత్తం చెల్లించాల్సి ఉంటుంది. ఉదాహరణకు కేజీఎఫ్2నే తీసుకుందాం. ఈ సినిమా ఆల్రెడీ అమెజాన్ ప్రైమ్ వీడియోస్ లో స్ట్రీమింగ్ కు వచ్చేసింది. మీకు అమెజాన్ సబ్ స్క్రిప్షన్ ఉంటే సరిపోదు. దాంతో పాటు అదనంగా 199 రూపాయలు చెల్లించాలి. అప్పుడు మాత్రమే కేజీఎఫ్2 మీకు చూడ్డానికి అందుబాటులోకి వస్తుంది.
అటు ఆర్అర్ఆర్ సినిమా పరిస్థితి కూడా ఇంతే. చరణ్, తారక్ హీరోలుగా నటించిన ఈ సినిమా మరో 3 రోజుల్లో జీ5లో స్ట్రీమింగ్ కు రాబోతోంది. దీన్ని చూడాలంటే కేవలం జీ5 సబ్ స్క్రిప్షన్ ఉంటే సరిపోదు. అదనంగా వంద రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. అప్పుడు మాత్రమే ఆర్ఆర్ఆర్ సినిమా 4K క్వాలిటీలో అందుబాటులోకి వస్తుంది.
ఇన్నాళ్లూ థియేటర్లలోనే అదనపు టికెట్ రేట్లు చూశాం. సినిమా విడుదలైన తొలి వారం లేదా మొదటి పది రోజులు టికెట్ రేట్లు పెంచుకుంటున్నారు. ఇప్పుడు ఓటీటీలోకి కూడా ఈ కల్చర్ వచ్చేసింది. ఓ పెద్ద సినిమా వచ్చినప్పుడు ఓటీటీలో కూడా రేట్లు పెడుతున్నారు.