బెంగుళూరు లోని యలహంక ఎయిర్ బేస్ లో జరిగిన ఏరో ఇండియా షో లో ప్రపంచం లోనే అత్యాధునికమైన ఎఫ్-35 జెట్ యుద్ధ విమానాలు రెండు తమ సత్తాను నిరూపించుకున్నాయి. అమెరికా నుంచి ఇక్కడికి చేరుకున్న ఇవి మొదటిసారిగా ఈ షోలో పాలు పంచుకున్నాయి. అమెరికా-ఇండియా మధ్య సంబంధాలు మరింత బలోపేతం కావడానికి ఈ విమానాలు నిదర్శనంగా నిలిచాయి. వీటిలో ఒకటి ‘గర్జిస్తూ.. అత్యంత వేగంగా ఎగిరింది. ఇది ఫిఫ్త్ జనరేషన్ ఫైటర్ జెట్.
ఇండియాలో ఈ తరహా విమానం ఎగరడం ఇదే మొదటిసారి. అమెరికాలోని డిఫెన్స్ కంపెనీ.. లాక్ హీడ్ మార్టిన్ అభివృద్ధి పరచిన ఈ విమానం విశిష్టతలు చాలా ఉన్నాయి. సూపర్ సోనిక్ వేగం, మల్టీ రోల్ కేపబిలిటీలు గల ఈ విమానం దొంగచాటుగా శత్రు విమానాలను నాశనం చేయగలదు. బెంగుళూరు లోని యలహంకలో జరిగే ఏరో ఇండియా షోలో విజిటర్లు ఆశ్చర్యకరమైన, అద్భుతమైన మా విమానాలను చూస్తారని అమెరికన్ ప్రతినిధిబృందం ముందే ప్రకటించింది.
అమెరికాకు చెందిన ఈ రెండు విమానాల్లో ఒకటి ఉటాహ్ లోని హిల్ ఎయిర్ ఫోర్స్ బేస్ నుంచి, మరొకటి అలాస్కా లోని ఈల్సన్ ఎయిర్ బేస్ నుంచి ‘ఎగిరివచ్చాయి’. ఈ రెండింటితో బాటు జనరల్ డైనమిక్స్ కి చెందిన ఎఫ్-16 ఫైటింగ్ ఫాల్కన్, బోయింగ్ సంస్ధకు చెందిన సూపర్ హార్నెట్ విమానాలు కూడా ఇక్కడికి చేరుకున్నాయి.
ఇక ఎఫ్-35 ఫైటర్ జెట్లలో అత్యంత అధునాతన ప్రాట్ అండ్ విట్నీ ఎఫ్ 135 జెట్ ఇంజన్ ని అమర్చారు. మాక్ 1.6 అంటే ధ్వని వేగం కన్నా ఇవి చాలా వేగంగా .. తమ స్టీల్త్ సత్తాను కోల్పోకుండానే ప్రయాణించగలదట.. భారీ ఆయుధ పేలోడ్లను కూడా ఇది మోసుకుపోగలదట. దీని ఇంజన్ 43 వేల పౌండ్ల ప్రొపల్షన్ శక్తిని విడుదల చేయగలదని, మూడు దశల ఫ్యాన్ ని, ఆరు దశల కంప్రెసర్ ని, సింగిల్ స్టేజ్ హై ప్రెషర్ టర్బైన్ ని ఈ విమానం కలిగి ఉంటుందని నిపుణులు తెలిపారు. అలాగే రెండు దశల లో ప్రెషర్ టర్బైన్ కూడా ఉండడం దీని విశిష్టత అన్నారు. ఇవన్నీ ఈ విమాన సామర్థ్యాన్ని అత్యధికంగా పెంచేవేనన్నారు. ఏరో షో లో అమెరికాకు చెందిన ఈ యుద్ధ విమాన విన్యాసాన్ని ప్రధాని మోడీ అత్యంత ఆసక్తిగా తిలకించారు.