ఫన్, ఫ్రస్ట్రేషన్ అనే కాన్సెప్ట్ తో తెరకెక్కింది ఎఫ్3 సినిమా. ఎఫ్2తో చాలా ఫన్ అందుకున్నారు మేకర్స్. పుష్కలంగా లాభాలు కళ్లజూశారు. కానీ ఎఫ్3కి వచ్చేసరికి ఫన్ కంటే ఫ్రస్ట్రేషనే ఎక్కువగా మిగిలేలా కనిపిస్తోంది. ఈ సినిమా చాలా ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ అవ్వలేదు. చివరికి ఓవర్సీస్ లో కూడా కాలేదని తాజా సమాచారం.
ఓవర్సీస్ లో ఈ సినిమాకు ఇప్పటివరకు 1.3 మిలియన్ డాలర్ల వసూళ్లు వచ్చాయి. బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే ఇంకా 65వేల డాలర్లు రావాల్సి ఉంది. ఇక ఓవరాల్ గా చూసుకుంటే.. వరల్డ్ వైడ్ ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వడానికి ఇంకా 12 కోట్ల 89 లక్షల రూపాయలు కావాలి.
తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా 53 కోట్ల 80 లక్షల రూపాయల ప్రీ-రిలీజ్ బిజినెస్ చేసింది. కానీ ఆదివారంతో కలిపి ఎఫ్3కి కేవలం 41 కోట్ల 81 లక్షల రూపాయల షేర్ మాత్రమే వచ్చింది. ఇంకా అటుఇటుగా 12 కోట్ల రూపాయలు రావాల్సి ఉంది.
నిజానికి శని, ఆదివారం వసూళ్లతో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అయిపోతుందని అంతా అనుకున్నారు. మేజర్ సినిమా సక్సెస్ అయినప్పటికీ జానర్ వేరు కాబట్టి, ఎఫ్3కి వసూళ్లు వస్తాయని భావించారు. కానీ.. మేజర్ సినిమాతో పాటు విక్రమ్ సినిమాకు కూడా సూపర్ హిట్ టాక్ రావడంతో, ఎఫ్3కి ఫుట్ ఫాల్ తగ్గిపోయింది.
అలా గడిచిన వీకెండ్ తో బ్రేక్ ఈవెన్ అవ్వాల్సిన సినిమా, ఇప్పుడు మరో వీకెండ్ కోసం ఆశగా ఎదురుచూడాల్సిన పరిస్థితికి వచ్చింది. అయితే వచ్చే వీకెండ్ పోటీ ఇంకాస్త గట్టిగా ఉండబోతోంది. ఈసారి ఎఫ్3 జానర్ లోనే అంటే సుందరానికి సినిమా వస్తోంది. అది కూడా క్లిక్ అయితే ఎఫ్3 రన్ దాదాపు ముగిసినట్టే.