ఎఫ్3 థియేటర్లలోకొచ్చి ఇప్పటికే చాన్నాళ్లయింది. అయినప్పటికీ ఈ సినిమా ప్రమోషన్ ఆపలేదు మేకర్స్. ఇంకా కొనసాగిస్తూనే ఉన్నారు. తాజాగా మరో ఈవెంట్ కూడా చేశారు. ఈ ఈవెంట్ లో మాట్లాడిన నిర్మాత దిల్ రాజు, ఎఫ్3 సినిమాకు ఇంకా డబ్బులొస్తున్నాయని ప్రకటించి సంచలనం సృష్టించారు.
“పాండమిక్ తర్వాత వీకెండ్ సినిమాలైపోయాయి. శుక్ర, శని, ఆదివారాలు కలెక్షన్ వుండి తర్వాత తగ్గిపోతున్నాయి. పాండమిక్ తర్వాత సినిమాలో చాలా మార్పులు వచ్చాయి. ఇంకా రాబోతున్నాయి. దీన్ని మేము అర్ధం చేసుకొని ప్లానింగ్ మార్చుకోవాలి. ఇంత పాండమిక్ లో కూడా 17 రోజులు పూర్తయి థర్డ్ వీకెండ్ కూడా ఎఫ్3ని ప్రేక్షకులు చూసి మాకు ఇంకా షేర్ రూపంలో డబ్బులు ఇస్తున్నారు. తెలుగు ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు. మూడో వారం కూడా సినిమా థియేటర్ లో ఆడుతూ ఇంకా రెవెన్యూ రావడమే ఎఫ్3 విజయానికి నిదర్శనం” అని అన్నారు.
ఎఫ్3 సినిమా రన్ దాదాపు ముగిసిందని అంతా భావిస్తున్న టైమ్ లో, ప్రతి వారాంతం ఈ సినిమాకు షేర్లు వస్తున్నాయని ప్రకటించి దిల్ రాజు ఓ చిన్నపాటి సంచలనం సృష్టించారు. ఎందుకంటే, ప్రస్తుతం ఏ సినిమాకైనా మొదటి 3 రోజులు మాత్రమే వసూళ్లు వస్తున్నాయి. మారిన పరిస్థితుల నేపథ్యంలో.. చిరంజీవి నటించిన సినిమానే 3 రోజులు మించి ఆడలేదు. దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకున్న మేజర్ సినిమాకు అరకొర వసూళ్లు వచ్చాయి. ఇలాంటి టైమ్ లో మూడో వీకెండ్ కూడా ఎఫ్3కి షేర్లు వస్తున్నాయని ప్రకటించి దిల్ రాజు సంచలనం సృష్టించారు.
అనిల్ రావిపూడి డైరక్ట్ చేసిన ఈ సినిమాలో వెంకీ, వరుణ్ తేజ్ హీరోలుగా నటించారు. మెహ్రీన్, తమన్న హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాలో పూజాహెగ్డే ఐటెంసాంగ్ చేసింది.