ప్రముఖ నేపథ్య గాయని వాణీ జయరాం(78) శనివారం కన్ను మూశారు. చెన్నైలోని తన స్వగృహంలో ఉదయం తుది శ్వాస విడిచారని ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు. వాణీ జయరాంకు తెలుగు వారితో జన్మజన్మల బంధం ఉంది. వాణీ జయరాం ది తెలుగు మాతృభాష కాకపోయినా.. ఆమె ఆలపించిన తెలుగు పాటలు నిత్యం సంగీతాభిమానులను ఏదో ఒక రూపంలో అలరిస్తూనే ఉన్నాయి. ఆమె అభిమానులు అదే పనిగా వాణీ పాటతోనే సాగుతూ ఉంటారు. అలాంటి వారందరూ వాణీ జయరాం ఇకలేరు అన్న వార్తను జీర్ణించుకోలేక పోతున్నారు. ఆమె తుదిశ్వాస విడిచారన్న చేదు నిజాన్ని తట్టుకోవడం కష్టంగా ఉదంటున్నారు.
‘విధిచేయు వింతలన్నీ, ఎన్నెన్నో జన్మలబంధం.. నీదీ నాదీ, నువ్వడిగింది ఏనాడైనా కాదన్నానా, సాగర సంగమమే, ఆలోకయే శ్రీ బాలకృష్ణం, రోజాలో లేతవన్నెలే, ఒక బృందావనం, ప్రణతి ప్రణతి ప్రణతి.. ప్రణవ నాద జగతికి, బ్రోచేవారెవరురా, దొరకునా ఇటువంటి సేవా, మానస సంచరరే, పలుకే బంగారమాయోనా, ఏ తీరుగ నను దయచూచెదవో’.. వంటి ఎన్నో మధురమైన గీతాలు ఆలపించారు వాణీ జయరాం.
తెలుగు, తమిళ, హిందీ, మలయాళ, గుజరాతీ, మరాఠీ, ఒరియా, భోజ్‌పురి మొత్తం 19 భాషల్లో 20 వేలకు పైగా పాటలను ఆమె పాడారు. కర్ణాటక సంగీతాన్ని ఆమె ఔపోసన పట్టారు. తన ఎనిమిదవ ఏటనే కచేరీలు నిర్వహించి అందరి ప్రశంసలు పొందారు. ముత్తు స్వామి దీక్షితార్ కీర్తనలు చక్కగా పాడేవారు. ఆమె దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా గొప్ప నేపథ్య గాయనిగా ఆమె పేరు తెచ్చుకున్నారు.
ఆమె తన గానంతో ఉత్తమ నేపథ్య గాయనిగా మూడుసార్లు జాతీయ ఫిల్మ్ అవార్డులను అందుకున్నారు. అంతేగాక పలు రాష్ట్రాల ప్రభుత్వాలు ఆమెను అవార్డులతో సత్కరించాయి. అయితే ఆమెకు కొద్ది రోజుల క్రితమే కేంద్ర ప్రభుత్వం ఇటీవలే పద్మభూషణ్ అవార్డును ప్రకటించింది. అది అందుకోకుండానే వాణీ జయరాం తుదిశ్వాస విడిచారు.