కాంగ్రెస్ పార్టీకి గుజరాత్ నేత హార్దిక్ పటేల్ బుధవారం రాజీనామా చేశారు. ఇటీవల జరిగిన కాంగ్రెస్ చింతన్ శిబిర్ కార్యక్రమానికి ఆయన దూరంగా ఉన్నారు. తాజాగా కార్యక్రమం ముగిసిన రెండు రోజులకే పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి ఆయన రాజీనామా చేయడం గమనార్హం.
ఈ విషయాన్ని ట్విట్టర్ లో వెల్లడించారు. తాను కాంగ్రెస్ కు, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టు ట్విట్ లో తెలిపారు. తన నిర్ణయాన్ని కాంగ్రెస్ నేతలు, గుజరాత్ ప్రజలు స్వాగతిస్తారని ఆశిస్తున్నట్టు పేర్కొన్నారు.
ఈ ఏడాది చివరి నాటికి గుజరాత్‌లో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో హార్దిక్ రాజీనామా కాంగ్రెస్‌కు చేదువార్త అనే చెప్పాలి. గుజరాత్ కాంగ్రెస్‌లో ఇటీవల అంతర్గత పోరు పెరిగింది.
పార్టీలో జరుగుతున్న పరిణామాల పట్ల ఆయన అసహనంగా ఉన్నట్టు ఇటీవల ఆయన చేస్తున్న వ్యాఖ్యల ఆధారంగా తెలుస్తోంది. ఈ క్రమంలో ఆయన కాంగ్రెస్ ను వీడి బీజేపీలో చేరతారనే వార్తలు వినిపించాయి. ఈ క్రమంలో ఆయన రాజీనామా చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.