సోషల్ మీడియాతో ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో.. అనర్ధాలు కూడా అంతే ఉన్నాయి. తాజాగా మీర్ పేట్ లో వెలుగుచూసిన ఘటనే అందుకు నిదర్శనం. ఫేస్ బుక్ పరిచయం.. ఓ యువకుడి మృతికి కారణమైతే.. నాలుగు కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. అనేక ట్విస్టులతో ఉన్న ఈ క్రైమ్ స్టోరీ విషయాలు ఇలా ఉన్నాయి.
వివరాల్లోకి వెళ్తే.. మీర్ పేట్ ప్రశాంతి హిల్స్ కు చెందిన శ్వేతారెడ్డి.. సోషల్ మీడియాలో యమ యాక్టివ్. రోజులో సగం సమయం అందులోనే. కొత్త స్నేహితుల పరిచయాలు.. పలకరింపులతో కాలం గడిచిపోతోంది. అయితే.. బాగ్ అంబర్ పేట్ కు చెందిన యశ్మకుమార్.. శ్వేతారెడ్డికి ఫేస్ బుక్ లో పరిచయం అయ్యాడు. కొద్దిరోజులకే బాగా కనెక్ట్ అయ్యాడు. ఇద్దరూ రోజూ ప్రేమ పాఠాల్లో మునిగితేలేవారు.
ఈ క్రమంలోనే యశ్మకుమార్ ఓరోజు శ్వేతారెడ్డికి ఫోన్ చేసి నగ్నంగా వీడియో కాల్ చేయాలని కోరాడు. ప్రేమ మత్తులో ఉండడంతో సరేనని ప్రియుడు చెప్పినట్టు చేసింది. నెల రోజులుగా ఈ తంతు కొనసాగింది. శ్వేత అంటే బాగా ఇష్టం పెరిగిపోయి యశ్మకుమార్ బుద్ధి మరింత గాడి తప్పింది. పెళ్లి చేసుకుంటావా? మన వీడియోలు, ఫోటోలు మీ కుటుంబసభ్యులకు పంపాలా? అంటూ బ్లాక్ మెయిల్ చేశాడు.
రోజురోజుకూ యశ్మకుమార్ టార్చర్ ఎక్కువవుతోంది. ఇన్నాళ్లూ హీరోలా కనిపించిన అతను విలన్ లా మారిపోవడంతో శ్వేత కూడా అదే రూట్ లో వెళ్లాలని భావించింది. ఫేస్ బుక్ ద్వారా పరిచయమైన మరో స్నేహితుడు ఏపీలోని కృష్టా జిల్లా తిరువురుకు చెందిన అశోక్ కు ఫోన్ చేసి పరిస్థితి వివరించింది. యశ్మకుమార్ ను ఎలాగైనా హత్య చేయాలని ప్లాన్ చెప్పింది. అన్నీ పక్కాగా చేసుకున్నారు. హత్య చేసి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించేందుకు చూశారు. కానీ.. పోలీసులకు అనుమానం వచ్చి కూపీ లాగడంతో ఈ వ్యవహారం అంతా బయటపడింది. శ్వేతారెడ్డితో పాటు మరో ఇద్దర్ని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు పోలీసులు.