వివాదాస్పద వ్యాఖ్యలతో సంచలనం రేపిన బీజేపీ మాజీ అధికార ప్రతినిధి నుపుర్ శర్మ మరో సారి సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఇటీవల పిటిషన్ విచారణ సందర్భంగా ఆమె వ్యాఖ్యలపై సుప్రీం కోర్టు న్యాయమూర్తులు తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
సుప్రీం కోర్టు వ్యాఖ్యల నేపథ్యంలో తనకు ముప్పు మరింతగా పెరిగిందని పేర్కొంటూ ఆమె మరోసారి సుప్రీం కోర్టు మెట్లెక్కారు. ఈ కేసులో అరెస్టు నుంచి తనకు రక్షణ కల్పించాలని ఆమె మరోసారి సర్వోన్నత న్యాయస్థానాన్ని కోరారు.
ప్రస్తుతం తన జీవితం ప్రమాదంలో పడిందని, హత్య, అత్యాచారం బెదిరింపులకు తనకు వస్తున్నాయని ఆమె పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో తనపై నమోదైన 9 కేసులను క్లబ్ చేసి వాటిని ఢిల్లీ కోర్టుకు బదిలీ చేయాలని ఆమె కోరారు.
నుపుర్ శర్మ తాజా పిటిషన్ పై సుప్రీం కోర్టు రేపు విచారణ చేపట్టనుంది. గతంలో ఆమె పిటిషన్ ను జస్టిస్ జేబీ పార్దీవాలా, జస్టిస్ సూర్యకాంత్ లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషన్ పై వాదనల సమయంలో నుపుర్ శర్మపై బెంచ్ తీవ్రంగా మండిపడింది. తాజాగా దాఖలైన పిటిషన్ ను కూడా అదే బెంచ్ న్యాయమూర్తులే విచారించనున్నారు.