తెలంగాణలో కరోనా వైరస్ కేసులు పెరుగుతుండటంతో సోషల్ మీడియాలో మళ్లీ ఫేక్ న్యూస్ వైరల్ అవుతున్నాయి. కొందరు ప్రభుత్వం గతంలో జారీ చేసిన ప్రకటనలను ఇప్పుడు మళ్లీ వైరల్ చేస్తోంటే.. మరికొందరు కొత్తగా తప్పుడు సమాచారం సృష్టించి ప్రజలని ఆందోళనకు గురి చేస్తున్నారు. తాజాగా అలాంటిదే నకిలీ ఉత్తర్వుల కాపీ ఒకటి వాట్సాప్పుల్లో చక్కర్లుకొడుతోంది. రాత్రివేళ దుకాణాల సమయాన్ని కుదిస్తున్నారంటూ అందులో ఉంది. జీవో నంబర్ 45 పేరిట సాధారణ పరిపాలన శాఖ ఉత్తర్వులు జారీ చేసినట్టుగా ప్రచారం జరిగింది. దీంతో ఈ వందతులపై తెలంగాణ ప్రభుత్వం స్పందించింది.
తెలంగాణలో లాక్‌డౌన్ విధించే అంశం అసలు ప్రభుత్వ పరిశీలనలో లేదని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ స్పష్టం చేశారు. దుకాణాలు, వాణిజ్య సంస్థలు, క్రీడాస్థలాలు సాయంత్రం 6 గంటలకు మూసివేయాలనేది వాస్తవం కాదని చెప్పారు. అలాంటి ఉత్తర్వులను ప్రభుత్వం ఇవ్వలేదని క్లారిటీ ఇచ్చారు. సోషల్ మీడియాలో సర్క్యూలేట్ అవుతున్న జీవో కాపీ నకిలీదని అన్నారు. తెలంగాణలో లాక్‌డౌన్ ఉండబోదని పునరుద్ఘటించారు.