కేరళ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కేరళలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఓటర్లను ఆకట్టుకునేందుకు చాలా ప్రయత్నాలే చేస్తున్నారు. తాజాగా కొల్లామ్‌లో మత్స్యకారులతో సమావేశమైన ఆయన.. ఆతర్వాత వారితో కలిసి సముద్రంలో చేపల వేటకు వెళ్లారు. స్వయంగా వల విసిరారు. రైతులు భూమిని సేద్యం చేస్తున్నట్టే.. మత్స్యకారులు సముద్రాన్ని సేద్యం చేస్తున్నారని అభిప్రాయపడ్డారు. అయితే రైతులకు దేశ రాజధానిలో వ్యవసాయశాఖ ఉందని, కానీ మత్స్యకారులకు ప్రత్యేక శాఖ లేదంటూ ఆరోపించారు. మత్స్యశాఖ ఉంటే వారి సమస్యలు సులువుగా పరిష్కారమవుతాయని చెప్పారు. ఇదిలా ఉంటే రాహుల్ చేసిన వ్యాఖ్యలపై నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.
దేశంలో ఇప్పటికే మత్స్య శాఖ ఉందని, ఆ విషయం రాహుల్ గాంధీకి తెలియకపోవడం విచిత్రంగా ఉందని కామెంట్లు చేస్తున్నారు. ఫిషరీస్ డిపార్ట్‌మెంట్ ట్విట్టర్ అకౌంట్‌ను.. రాహుల్ గాంధీ అకౌంట్‌కు ట్యాగ్ చేస్తున్నారు. కాబోయే ప్రధానికి దేశంలో ఏయే శాఖలు కూడా ఉన్నాయో కూడా తెలియకపోతే ఎలా అంటూ ఎద్దేవా చేస్తున్నారు.