– ఉద్ధవ్ రాజీనామాకు గవర్నర్ ఆమోదం
– రెబెల్ ఎమ్మెల్యేలకు బీజేపీ బంపరాఫర్
– ప్రమాణ స్వీకారానికి రెడీ అవుతున్న ఫడ్నవీస్
మహరాష్ట్ర రాజకీయ సంక్షోభం ఓ కొలిక్కి వస్తోంది. బలపరీక్షను ఎదుర్కోలేక ముందే ఉద్ధవ్ ఠాక్రే రాజీనామా చేశారు. తాజాగా గవర్నర్ కోశియారి ఆయన రాజీనామాను ఆమోదించారు. ఈ క్రమంలోనే ఫడ్నవీస్ సీఎంగా ప్రమాణం చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది.
సీఎం హోదాలోనే ఫడ్నవీస్ జులై 2న హైదరాబాద్ లో జరిగే బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశానికి హాజరు అవుతారని బీజేపీ నేతలు చెబుతున్నారు. గోవాలో ఉన్న శివసేన తిరుగుబాటు ఎమ్మెల్యేలతో ఫడ్నవీస్ టచ్ లో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే బీజేపీ కోర్ గ్రూప్ సమావేశం అయింది. శివసేన రెబెల్స్ తో కీలక చర్చలు జరపాలని సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.
పదవుల పంపకంపై సమావేశంలో కీలక చర్చలు జరిపారని తెలుస్తోంది. రాబోయే 48 గంటల్లో సీఎంతో పాటు డిప్యూటీ సీఎం ప్రమాణ స్వీకారం చేస్తారని సమాచారం. షిండేకు డిప్యూటీ సీఎం ఆఫర్ ఇచ్చినట్లుగా ప్రచారం సాగుతోంది. ప్రమాణ స్వీకారోత్సవానికి శివసేన రెబెల్ ఎమ్మెల్యేలు అందరూ హాజరుకానున్నారు. షిండే వర్గంతో పాటు స్వతంత్య్ర ఎమ్మెల్యేలు కూడా రానున్నారు.
రెబెల్ వర్గానికి చెందిన 12 మంది ఎమ్మెల్యేలకు ఫడ్నవీస్ క్యాబినెట్ లో బెర్త్ దొరికే అవకాశాలు ఉన్నాయని వార్తలు వస్తున్నాయి. అలాగే ముగ్గురు స్వతంత్రులకు కూడా మినిస్టర్ పదవి దక్కే ఛాన్సు ఉందంటున్నారు.