లక్నో సూపర్ జెయింట్స్ పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం సాధించింది. ఓ వైపు ఫాఫ్ డుప్లెసిస్ బ్యాటింగ్ తో విరుచుకు పడగా, మరోవైపు హజేల్ వుడ్ బౌలింగ్ తో నిప్పులు చెరిగాడు. దీంతో రాయల్ ఛాలెంజర్స్ అద్భతమైన విజయాన్ని అందుకుంది.
రాయల్ ఛాలెంజర్స్ విసిరిన 182 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన లక్నో జట్టుకు ఆదిలోనె గట్టి ఎదురు దెబ్బ తాకింది. ఓపెనర్ క్వింటన్ డీకాక్(3), ఆ తర్వాత వచ్చిన మనీశ్ పాండేల(6)ను జేమ్స్ హజేల్ వుడ్ తక్కువ పరుగులకే ఔట్ చేశాడు.
ఆ తర్వాత వచ్చిన క్రునాల్ పాండ్యేతో కలిసి ఓపెనర్ కేఎల్ రాహుల్ కొద్ది సేపు చెలరేగిపోయాడు. అయితే కేఎల్ రాహుల్ (30), క్రునాల్ పాండ్యే(42) పరుగులు చేసి ఔట్ అయ్యారు. తర్వాత బ్యాట్స్ మెన్లు తక్కువ బంతుల్లో ఎక్కువ పరుగులు రాబట్టలేకపోయారు. దీంతో 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది. దీంతో 18 పరుగుల తేడాతో ఛాలెంజర్స్ విజయం సాధించింది.
అంతకు ముందు మొదట బ్యాటింగ్ చేసిన ఛాలెంజర్స్ జట్టులో ఓపెనర్ అనుజ్ రావత్ నిరాశ పరిచాడు. నాలుగు పరుగులు చేసి దుశ్మంత చమీరా బౌలింగ్ లో కేఎల్ రాహుల్ కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. ఆ తర్వాత వచ్చిన కోహ్లీ కూడా నిరాశ పరిచాడు. తర్వాత బంతికే చమీరా బౌలింగ్ లో దీపక్ హుడాకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు.
ఆ తర్వాత వచ్చిన గ్లెన్ మ్యాక్స్ వెల్ తో కలిసి మరో ఓపెనర్ డుప్లెసిస్ రెచ్చి పోయాడు. బౌలర్లపై విరుచుకు పడుతూ పరుగుల వరద పారించాడు. ఈ క్రమంలో 23 పరుగులు చేసిన మ్యాక్స్ వెల్ క్రునాల్ పాండ్యా బౌలింగ్ లో జేసన్ హోల్డర్ కు క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు.
ఆ తర్వాత సుయాష్ ప్రభుదేశాయ్ 10 పరుగులకే ఔట్ అయ్యాడు. దీంతో క్రీజులోకి వచ్చిన షాహబాజ్ అహ్మద్ డుప్లెసిస్ తో కలిసి స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. 26 పరుగులు చేసిన తర్వాత కేఎల్ రాహుల్ చేతిలో అహ్మద్ రనౌట్ అయ్యాడు. దినేష్ కార్తీక్ తో కలిసి డుప్లెసిస్ 6 వ వికెట్ కు 49 పరుగులు జోడించాడు. డుప్లెసిస్ 96 పరుగుల వద్ద జాసన్ హోల్డర్ బౌలింగ్ లో స్టోయినస్ కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది.