ఆధునిక యుగంలో కూడా మూఢ నమ్మకాలను నమ్మేవాళ్లు ఇంకా ఉన్నారు. వారి అమాయకత్వమే మోసగాళ్లకు పెట్టుబడి. అందుకే పూజలు, పునస్కారాల పేరిట మోసాలకు పాల్పడేవాళ్లు పుడుతూనే ఉన్నారు. పేరుమోసిన బాబాల నుంచి గల్లీలోని బాబా వరకు అందరూ మోసం చేసేవాళ్లే. తాజాగా తెలంగాణలో ఓ దొంగ బాబా వెలుగులోకి వచ్చాడు.
గుర్రంపై గ్రామాల్లో తిరుగుతూ హల్ చల్ చేస్తున్నాడు. పూజల పేరిట ప్రజల నుంచి వసూళ్లకు పాల్పడుతున్నారు. అతడి వ్యవహారం రాజన్న సిరిసిల్ల జిల్లాలో కలకలం రేపుతోంది. వివరాలు ఇలా ఉన్నాయి.. దేశ గురుగా ఓ వ్యక్తి కొత్త అవతారమెత్తాడు. వేములవాడ రూరల్ మండలంలోని గ్రామాల్లో ఆ బాబా తిరుగుతున్నాడు. గుర్రంపై తిరుగుతూ గ్రామాల్లోకి వస్తున్నాడు. ఈ సందర్భంగా గ్రామాల్లో డప్పు చాటింపు కూడా వేయించి ఇంటింటికి తిరుగుతున్నాడు.
ఇంటింటికి తిరుగుతూ పూజల పేరుతో భయభ్రాంతులకు గురి చేస్తున్నాడు. ఈ క్రమంలో పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నట్లు సమాచారం. ‘ఇంటికి వచ్చి కొబ్బరికాయ కొడతాడు. అందులో నచ్చినంత కట్నం వేసుకోవాలి. దోషాలు తొలగిపోతాయి’ అంటూ డప్పు చాటింపు వేయిస్తున్నారు.
అలా బాబా ఇంటింటికి తిరుగుతూ టెంకాయ కొడుతూ వస్తున్నాడు. ఈ సమయంలో ప్రజలు రూ.500 నుంచి రూ.5 వేల వరకు కట్నంగా సమర్పించుకుంటున్నారు. ఇక ఒకవేళ డబ్బులు ఇవ్వకపోతే బలవంతంగా వసూలు చేస్తున్నారని సమాచారం. దేశ గురువు పేరిట వ్యక్తి సాగిస్తున్న తంతుపై ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు స్వీకరించిన ఎస్సై నాగరాజు ప్రజలను అప్రమత్తంగా ఉండాలని సూచించారు. చివరకు అతడి ఆచూకీ తెలుసుకుని దొంగబాబా ఆట కట్టించినట్లు ఎస్సై తెలిపారు. ప్రజలు బాబాలను నమ్మవద్దని చెప్పారు.