భారత దేశంలో మూఢనమ్మకాలు సర్వసాధారణం. ఫలానా పూజ చేస్తే నిధులు దొరుకుతాయని, బలిదానాలు ఇస్తే కనకవర్షం కురుస్తుందని.. చాలా మంది ఇప్పటికీ నమ్ముతూనే ఉన్నారు. ఇందుకు సంబంధించిన పలు ఘటనలు కూడా ఈ మధ్య జరుగుతూనే ఉన్నాయి. దీన్నే ఆసరాగా తీసుకొని.. కొందరు దొంగ బాబాలు దారుణాలకు పాల్పడుతున్నారు. అమాయక ప్రజల్ని టార్గెట్ చేసి, దుర్మార్గపు పనులు చేయిస్తున్నారు. ముఖ్యంగా స్త్రీలనే టార్గెట్ చేసుకుని అశ్లీల దందాలకు దిగుతున్నారు. తాజాగా ఇలాంటి దారుణ ఘటనే జడ్చర్లలో చోటుచేసుకుంది.
డీటైల్స్ కి వెళ్తే.. జడ్చర్లలోని జైనుల్లబుద్దీన్ అనే దొంగ బాబా స్త్రీలు నగ్నంగా పూజలు చేస్తే కనక వర్షం కురుస్తుందని నమ్మబలికేవాడు. హైదరాబాద్ లోని తమ గురువు వద్ద ఒక రోజంతా గడిపితే.. కాసుల వర్షానికి హద్దే ఉండదని నమ్మించేవాడు. అయితే ఇందుకు షరతులు కూడా పెట్టాడు ఆ దొంగ బాబా. గురువుతో గడిపే సమయంలో వేరే భావన మదిలో మెదలకూడదని చెప్పేవాడు.
ఒకవేళ అలాంటి ఆలోచన మనసులో వస్తే.. ధారగా కురిసే కనకవర్షం మధ్యలోనే ఆగిపోతుందని చెప్పేవాడు. నగ్న పూజలు చేస్తున్న సమయంలో ఫొటోలు, వీడియోలు తీసినా.. ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం చేయకూడదనేవాడు. ఆ దొంగ బాబా మాటలు నమ్మిన మహిళలు.. అతడు చెప్పినట్లుగా వినేవారు.
ఇతని వద్దకు రెండు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా.. కర్ణాటక రాష్ట్రానికి చెందిన మహిళలు కూడా వచ్చేవారు. కనక వర్షం కురవడం సంగతి పక్కన పెడితే.. మహిళలతో ఆ దొంగ బాబా దుర్మార్గపు దందాలు చేయించేవాడు. స్త్రీల పుట్టుమచ్చల ఆధారంగా జాతకాలు చూస్తామంటూ నగ్న వీడియోలు తీసేవాడు. చివరికి ఇతని బాగోతం బట్టబయలు కావడంతో.. స్థానికులు ఆ దొంగ బాబాకి దేహశుద్ధి చేసి, పోలీసులకు అప్పగించారు.