రాకెట్లు వేసుకుని ఆకాశంలోకి దూసుకెళ్తున్నాం.. అయినా క్షుద్ర పూజలు అంటూ ప్రజల్ని మభ్య పెట్టే బ్యాచ్ కు కొదవేం లేదు. రోజూ ఎక్కడో ఓచోట పూజల పేరుతో మోసాలు జరుగుతూనే ఉన్నాయి. మనుషుల్లోని భయమే పెట్టుబడిగా డబ్బులు దండుకుంటోంది గ్యాంగ్. తాజాగా రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ కమ్మదనం గ్రామ శివారులో శివస్వామి అనే వ్యక్తి కొంతకాలంగా ఓ ప్రైవేట్ వెంచర్ లో ఇల్లు కట్టుకుని.. కాళికామాత విగ్రహం పెట్టి పూజలు చేస్తున్నాడు. అతని వద్దకు వెళ్లేవారి కళ్లల్లో నిమ్మ రసం పిండి, వెంట్రుకలు పట్టి కొడుతున్నాడు. అమ్మవారి పాదాల కింద పోటోలు పెట్టి వశీకరణ మంత్రం రాగి పూతలతో కూడుకున్న పేర్లు రాసి పెడుతున్నాడు.
గతంలో మధురాపూర్ గ్రామంలో ఇలాగే ప్రవర్తించగా.. గ్రామస్తులు బెదిరించడంతో అక్కడి నుండి వెంచర్ దగ్గరకు క్షుద్ర పూజలను షిఫ్ట్ చేశాడు శివస్వామి. అతడి మంత్రాలకు ఏ చింతకాయలు రాలడం లేదని గ్రహించిన ఓ యువతి షాద్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో బండారం మొత్తం బయటపడింది. తన కుటుంబానికి బాలేదని శివస్వామి దగ్గరకి వెళితే వేల రూపాయలు తీసుకొని మోసం చేశాడని బాధిత యువతి పోలీసులకు కంప్లయింట్ చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
షాద్ నగర్ చుట్టుపక్కల గ్రామాలతో పాటు ఇతర ప్రాంతాల నుండి కూడా ఇతని దగ్గరకు వస్తుంటారు జనాలు. కొద్ది రోజులుగా గుప్త నిధుల తవ్వకాల కోసం కొంతమందిని తన వెంట తీసుకెళ్ళాడని చెబుతున్నారు స్థానికులు. ఒకొక్కరుగా బాధితులు బయటికి వస్తున్నారు. ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఇప్పటికే పదుల సంఖ్యలో బాధితులు బయటికి వచ్చారు. పూర్తి స్థాయిలో విచారణ చేస్తే ఈ సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అంటున్నారు.