పాతబస్తీలో నకిలీ కరెన్సీ ముఠా గుట్టు రట్టు అయింది. ఫేక్ నోట్ల ప్రింటింగ్ పై పక్కా సమాచారంతో పాతబస్తీలో పోలీసులు దాడులు చేశారు. దాడుల్లో భారీగా నకిలీ కరెన్సీ పట్టుబడింది. ముఠాకు చెందిన ముగ్గురు సభ్యులను పోలీసులు అరెస్టు చేశారు.
మొత్తం రూ. 30 లక్షల నకిలీ కరెన్సీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీంతో పాటు నకిలీ కరెన్సీని ముంద్రించేందుకు ఉపయోగించిన ప్రింటర్ ను సీజ్ చేశారు. అరెస్టైన వారిలో ఓ మహిళ కూడా ఉండటం గమనార్హం. గత కొంత కాలంగా నిందితులు ఈ దందా చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.
నిందితులపై యూపీతో పాటు బిహార్, గుజరాత్ సహా పలు రాష్ట్రాల్లో సైతం కేసులు నమోదైనట్లు పోలీసులు గుర్తించారు. నకిలీ కరెన్సీకి సంబంధించి అన్ని కోణాల్లో ముఠా సభ్యులను పోలీసులు విచారిస్తున్నట్టు తెలుస్తోంది.
ఈ ముఠా వెనుక ఎవరైనా హస్తం ఉందా? ఏ నకిలీ కరెన్సీని ఎక్కడికి సరఫరా చేస్తున్నారు. సరఫరాకు ఎలాంటి పద్దతులు ఉపయోగిస్తున్నారు. అనే అంశాలపై ముఠా సభ్యుల నుంచి పోలీసులు సమాచారాన్ని రాబడుతున్నట్టు సమాచారం.