– ప్రముఖ హాస్పిటల్ లో నకిలీ డాక్టర్
– డబ్బులు ఇవ్వాలంటూ పేషెంట్ బంధువులకు ఫోన్
– కండీషన్ సీరియస్ అంటు హై డ్రామా
– సినిమా తరహాలో మోసానికి యత్నం
– అనుమానం వచ్చి ఆసుపత్రి యాజమాన్యానికి ఫిర్యాదు
– నగరంలోని విరించి హాస్పిటల్ లో ఓ ఎపిసోడ్
కార్పొరేట్ ఆసుపత్రులంటేనే సామాన్యుల గుండెల్లో గుబులు పుడుతోంది. ట్రీట్ మెంట్ పేరుతో డాక్టర్లు రోగుల బంధువులతో బేరాలు ఆడటం సహజంగా చూస్తుంటాం. డబ్బులిస్తేనే వైద్యం చేస్తామని ప్రణాలు పోయినా పట్టించుకోరు అనే అపరాధన కూడా డాక్టర్లు, కార్పొరేట్ ఆసుపత్రుల మీద ఉంది. అంతేకాదు.. డబ్బులు తీసుకోవడం మీదున్న శ్రద్ద.. రోగి ఆరోగ్యం పట్ల ఉండదనే విమర్శలు కూడా వెల్లువుత్తుతున్న నేపథ్యంలో దానికి అద్దం పట్టే సంఘటన నగరంలోని ఓ కార్పొరేట్ ఆసుపత్రిలో చోటుచేసుకుంది.
అనారోగ్యంతో బాధపడుతున్న ఓ రోగిని నగరంలోని బంజారాహిల్స్ లో గల ప్రముఖ కార్పొరేట్ హాస్పిటల్ విరించి లో ట్రీట్ మెంట్ కోసం చేర్చారు కుటుంబ సభ్యులు. రోగి ఆరోగ్యపరిస్థితి దృష్ట్యా ఐసీయూలో చేర్చి ట్రీట్ మెంట్ అందిస్తున్నారు డాక్టర్లు. ఇదిలా ఉంటే.. ఓ 19 ఏళ్ల కుర్రాడు డాక్టర్ వేశంలో సరాసరి ఐసీయూలోకి వెళ్లాడు. అక్కడ ఉన్న నర్సును పిలిచి ఓ రోగికి సంబంధించిన కేస్ షీట్ తీసుకురమ్మన్నాడు.
నిజంగానే డాక్టర్ ఏమో అనుకున్న నర్సు.. కేస్ షీట్ తీసుకొచ్చి ఇచ్చింది. అది పరీశీలించి అందులో ఉన్న కాంటాక్ట్ నంబర్ తీసుకొని రోగి కుటుంబ సభ్యులకు ఫోన్ చేశాడు. పేషెంట్ కండీషన్ సీరియస్ గా ఉంది. సర్జరీ చేయాలని చెప్పాడు. అందుకు సుమారు రూ. 50 వేల వరకు ఖర్చు అవుతాయని.. అవి అర్జెంట్ గా తమ అకౌంట్ కు పంపించాలని చెప్పాడు. దీంతో కంగారుపడ్డ రోగి బంధువులు.. తమకు ఈఎస్‌ఐ వర్తిస్తుందని డబ్బులు ఎందుకు ఇవ్వాలని ప్రశ్నించారు.
దీంతో నకిలీ డాక్టర్ వెంటనే ఫోన్‌కాల్ కట్ చేశాడు. అనుమానం వచ్చిన రోగి బంధువులు ఆసుపత్రి యాజమాన్యానికి ఫిర్యాదు చేశారు. ఆపరేషన్ చేయాలంటూ ఎవరో డాక్టర్ పేరుతో డబ్బులు అడుగుతున్నారని కంప్లీంట్ చేశారు. దీంతో విషయం బయటపడింది. అప్రమత్తమైన హాస్పిటల్ సిబ్బంది.. స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు అక్కడ జరిగిన తతంగాన్ని అంతా తెలుసుకున్నారు.
రోగి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పంజాగుట్ట పోలీసులు.. హాస్పిటల్ లో ఉన్న సీసీ కెమెరాల ఆధారంగా కేసును దర్యాప్తు చేస్తున్నామన్నారు. గతంలో కూడా ఇదే తరహా మోసాలకు ఏమైనా పాల్పడ్డాడా..? అనే కోణంలో కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. నకిలీ డాక్టర్ కార్పొరేట్ ఆసుపత్రిలోని ఐసీయూ గదిలోకి వెళ్లే వరకు సెక్యురిటీ, యాజమాన్యం ఏం చేస్తోందని రోగి బంధువులు, పోలీసులు నిలదీస్తున్నారు.