ఈ సంవత్సరానికి గాను ప్రధాని మోడీకి నోబెల్ శాంతి బహుమతి ఇవ్వనున్నారని వచ్చిన వార్తలపై నార్వేజియన్ నోబెల్ కమిటీ డిప్యూటీ లీడర్ ఆస్లే టోజ్ స్పందించారు. ఇది ఫేక్ న్యూస్ అని, వదంతి మాత్రమేనని స్పష్టం చేశారు. మోడీ పేరును తమ కమిటీ పరిశీలిస్తున్నదని వచ్చిన వార్త నిరాధారమన్నారు. ఈ వ్యాఖ్యతో సంబంధమున్న ఎలాంటి ట్వీట్ తాను చేయలేదని ఆయన చెప్పారు. మోడీని నోబెల్ శాంతి బహుమతికి ఎంపిక చేశారంటూ సోషల్ మీడియాలో ట్వీట్లు వెల్లువెత్తుతున్న వేళ ఆస్లే టోజ్ ఈ వివరణనిచ్చారు.
‘దీనిపై మరింత చర్చించి దీనికి ప్రాచుర్యం కల్పించకండి ..దీనికి మరింత ‘ఆక్సిజన్’ ఇవ్వకండి’ అని కోరిన ఆయన.. ఈ వార్తలను పూర్తిగా తోసిపుచ్చుతున్నట్టు పేర్కొన్నారు. ప్రస్తుతం ఈయన ఇండియా పర్యటనలో ఉన్నారు.
నార్వేజియన్ నోబెల్ కమిటీ డిప్యూటీ లీడర్ గా తాను ఇక్కడికి రాలేదని, భారత మిత్రుడిగా, ఇంటర్నేషనల్ పీస్ డైరెక్టర్ గా వచ్చానని ఆయన తెలిపారు. ప్రధాని మోడీ నాయకత్వాన్ని ఆయన ప్రశంసిస్తూ.. రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్దాన్ని నివారించేందుకు మోడీ ఎంతగానో ప్రయత్నించారన్నారు.
యుద్దానికి ఇది తరుణం కాదని రష్యా అధ్యక్షుడు పుతిన్ కి నచ్చజెప్పారన్నారు. ఈ దేశ ప్రజలంతా మోడీ వెంటే ఉన్నారని టోజ్ వ్యాఖ్యానించారు. ఇండియా ఎప్పుడూ గొంతెత్తి మాట్లాడదు. ఎవరినీ బెదిరించదు.. ఏది చెప్పినా స్నేహపూర్వకంగా చెబుతుంది అని పేర్కొన్న ఆయన.. ప్రపంచంలోని శక్తిమంతమైన దేశాల్లో ఇండియా ఒకటన్నారు.