ప్రముఖ టెక్ దిగ్గజ సంస్థ గూగుల్ పై రష్యన్ న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఉక్రెయిన్‌లో క్రెమ్లిన్ సైనిక చర్యకు సంబంధించిన వివాదాస్పద యూట్యూబ్ వీడియోలను తీసివేయడంలో విఫలమైనందుకు గూగుల్ పై రష్యన్ కోర్టు వరుస జరిమానాలను విధించింది.
ఉక్రెయిన్‌లో రష్యాకు భారీ నష్టం వాటిల్లిందని ఆరోపిస్తున్న పోస్ట్‌లను తొలగించాలన్న స్టేట్ మీడియా రెగ్యులేటర్ ఆదేశాలను గూగుల్ పట్టించుకోలేదని మాస్కో కోర్టు తెలిపింది. ఈ మేరకు గూగుల్ పై 11 మిలియన్ రూబుల్స్ జరిమానాను కోర్టు విధించింది.
ఇందులో ఒక వీడియోలో సంభాషణ రష్యన్ సైనికులు, వారి బంధువుల మధ్య జరిగినదిగా చూపిస్తోంది. దీనిలో తమ సైన్యంలో భారీ ప్రాణ నష్టం జరిగినట్టుగా రష్యన్ సైనికులు వాళ్ల బంధువులకు ఫిర్యాదు చేస్తున్నట్టు కనిపిస్తోంది.
ఉక్రెయిన్ ఎదురుదాడి నుంచి వెనక్కి వెళ్లేందుకు కొందరు రష్యన్ సైనికులు ప్రయత్నిస్తున్నారని, వారిని ఆ దేశం సైన్యం కాల్చివేస్తోందంటూ మరో వీడియోలో ఆరోపించినట్టు ఆ దేశ మీడియా నివేదికలు చెబుతున్నాయి.