హైదరాబాద్ తార్నాకలో దారుణ ఘటన వెలుగుచూసింది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు ఉరి వేసుకుని చనిపోయారు. వివరాల్లోకి వెళ్తే… ప్రతాప్, సింధూర భార్యాభర్తలు. వీళ్లిద్దరికి ఆద్య అనే నాలుగేళ్ల కుమార్తె ఉంది. ప్రతాప్ తల్లి రజతి కూడా వీరితో ఉంటోంది. అయితే.. సింధూర హిమాయత్ నగర్ లోని ఓ ప్రైవేట్ బ్యాంకులో మేనేజర్ గా పని చేస్తోంది. అలాగే, ప్రతాప్ బీఎండబ్ల్యూ కారు షోరూంలో డిజైనర్ మేనేజర్ గా విధులు నిర్వహిస్తున్నాడు.
చిన్నారితో సహా నలుగురు విగతజీవులుగా కనిపించారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు.. స్పాట్ కు చేరుకుని తలుపులు బద్ధలుకొట్టి ఇంటి లోపలికి వెళ్లారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కుటుంబ కలహాలే ఘటనకు కారణమని ప్రాథమికంగా నిర్ధారించిన పోలీసులు.. ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. నాలుగు మృతదేహాలను గాంధీ మార్చురీకి తరలించినట్టు ఓయూ ఇన్స్పెక్టర్ రమేశ్ తెలిపారు.
ఇటు.. వికారాబాద్ జిల్లాలో తీవ్ర విషాద ఘటన చోటు చేసుకుంది. పండుగ సందర్భంగా కోటిపల్లి రిజర్వాయర్ కి విహారయాత్రకు వెళ్లింది ఓ కుటుంబం. అయితే.. నలుగురు వ్యక్తులు ఈతకు దిగి గల్లంతయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని స్థానికుల సహయంతో గాలింపు చర్యలు చేపట్టారు. గల్లంతైన నలుగురు వ్యక్తుల్లో ముగ్గురు మృతి చెందారు.
మృతులను పూడూరు మండలం మన్నెగూడకు చెందిన లోకేశ్, జగదీశ్, వెంకటేశ్, రాజేశ్ లుగా గుర్తించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను వికారాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.