ఆర్థిక ఇబ్బందులతో ఓ కుటుంబం ఆత్మహత్యకు పాల్పడిన ఘటన సంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. మునిపల్లి మండలం గార్లపల్లికి చెందిన చంద్రకాంత్ టీసీఎస్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి. భార్య లావణ్య.. ఇద్దరు పిల్లలతో కలిసి హైదరాబాద్ శివారులోని బీహెచ్ఈఎల్‌లో నివాసం ఉంటున్నాడు. అక్కడే ఓ కొత్త ఇంటికి నిర్మాణం కూడా చేపట్టాడు. అయితే నిర్మాణానికి డబ్బులు సరిపోకపోవడంతో లావణ్య తన తల్లిదండ్రులను సాయం అడిగింది. వారు రూ.40 లక్షల వరకు సాయం అందిస్తామన్నారు. ఇదే విషయమై చంద్రకాంత్ తన తల్లిదండ్రులను కూడా కొంత సాయం చేయమని అడగగా వారు నిరాకరించారు.
వచ్చే జీతం మొత్తం ఇంటి నిర్మాణానికి సరిసోతోంది. ఇల్లు గడిచే పరిస్థితి లేక తరచూ గొడవలు అవుతుండేవి. దీంతో లావణ్య ఇద్దరు పిల్లలను తీసుకొని పుట్టింటికి వెళ్ళిపోయింది. మనస్తాపానికి గురైన చంద్రకాంత్ ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న లావణ్య ఇద్దరు పిల్లలతో సహా ఆంథోని చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుంది. మృతదేహాలు నీటిలో తేలడంతో గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు లావణ్యతో పాటు ఇద్దరు పిల్లల మృతదేహాలను బయటకు తీసి.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.