36 ఏళ్లుగా చీకటిలోనే మగ్గిన ఓ కుటుంబానికి ఊరట లభించింది. పశ్చిమ బెంగాల్ కోల్ కతాలోని ఓ కుటుంబానికి 36 ఏళ్లు తర్వాత విద్యుత్ కనెక్షన్ అందింది. బహ్రంపూర్ కు చెందిన సకీనా షేక్ కుటుంబం.. ఏళ్ల పాటు చీకట్లోనే గడిపింది. వీరంతా ఇన్నేళ్లుగా విద్యుత్ అవసరాల కోసం పక్కింటి వారిపై ఆధారపడ్డారు. విద్యుత్ కనెక్షన్ కోసం అవసరమైన డబ్బు చెల్లించే స్థోమత కూడా వారికి లేదు.
అయితే రాష్ట్ర మంత్రి అరూప్ విశ్వాస్ చొరవతో ఆ కుటుంబానికి విద్యుత్ సౌకర్యం అందింది. కొద్ది రోజుల క్రితం ఈ ప్రాంతంలో పర్యటించిన అరూప్ బిశ్వాస్.. సకినా ఇంటి పరిస్థితి తెలుసుకున్నారు. ఈ కాలంలో కూడా విద్యుత్ కనెక్షన్ లేకపోవడం పట్ల ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
వెంటనే కోల్ కతా మున్సిపల్ కార్పొరేషన్ అధికారులను రంగంలోకి దించారు. మంత్రి ఆదేశాల ప్రకారం.. చర్యలు చేపట్టి.. ఆ కుటుంబానికి విద్యుత్ సౌకర్యం కల్పించారు. అలాగే ఇంటికి కులాయి కనెక్షన్ ను సైతం అందించారు.
అనంతరం సకినా షేక్ మాట్లాడుతూ.. రాష్ట్ర మంత్రి అరూప్ విశ్వాస్ కు, మున్సిపల్ అధికారులకు ధన్యవాదాలు తెలిపారు. మేము ఇక్కడే 36 ఏళ్లుగా ఉంటున్నామని, విద్యుత్ కనెక్షన్ కావాలంటే ఛార్జీలు చెల్లించే పరిస్థితి కూడా మాకు లేదన్నారు. అలాగే ఇబ్బందులు తట్టుకోలేక స్థానిక కౌన్సిలర్, ఎమ్మెల్యేకు మా బాధను చెప్పుకున్నట్లు తెలిపారు. వారి వల్లే మా ఇంటికి వెలుగు వచ్చిందని కన్నీటి పర్యంతమయ్యారు.